ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉత్తుత్తి ప్రారంభోత్సవాలతో రైతులు సంతోషిస్తారా జగన్​ ?: టీడీపీ - జగన్​ ఉత్తుత్తి ప్రారంభోత్సవాలు

TDP MLC on Veligonda Project: వెలిగొండ ప్రాజెక్ట్ తనవల్లే పూర్తయిందని సీఎం జగన్ ప్రచారం చేసుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి విమర్శించారు. నీళ్లులేని ప్రాజెక్టులకు రిబ్బన్లు కత్తిరించి రైతుల్ని మోసగించారని విమర్శించారు. జగన్‌ పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క జల ప్రాజెక్టు పూర్తీ కాలేదని బీజేపీ నేత లంకా దినకర్‌ ఆరోపించారు. జగన్ అద్దెకు తెచ్చి ఎత్తిన గేటు ఎటు పోయిందని ఎద్దేవా చేశారు.

TDP MLC on Veligonda Project
TDP MLC on Veligonda Project

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 6, 2024, 5:18 PM IST

TDP MLC Bhumireddy Ramgopal Reddy on Veligonda Project: ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డగా ముద్దాడే జగన్ రెడ్డి వ్యవహారశైలిని ఏమనాలని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ప్రశ్నించారు. వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణానికి చంద్రబాబు 1450 కోట్లు కేటాయించి, 90 శాతం వరకు సొరంగాల నిర్మాణం పూర్తి చేయించారని గుర్తు చేశారు. జగన్ రెడ్డి 5ఏళ్లలో 950 కోట్లు కేటాయించి, మిగిలిన పనులు మొక్కుబడిగా చేయించి మొత్తం ప్రాజెక్ట్ తనవల్లే పూర్తయిందని సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటున్నాడని మండిపడ్డారు.

శ్వేతపత్రం విడుదల చేయాలి: మొన్న కుప్పం హంద్రీనీవా కాలువ మాదిరే, నేడు వెలిగొండ ప్రాజెక్ట్ లో కూడా నీళ్లు లేకుండానే ప్రారంభించడం జగన్ ప్రచారపిచ్చికి నిదర్శనమని భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. నీళ్లు లేని ప్రాజెక్టులకు రిబ్బన్లు కత్తిరించి రైతుల్ని మోసగించడం అంత తేలిక కాదని తెలుసుకో జగన్ రెడ్డి అని హితవు పలికారు. వెలిగొండ నిర్వాసితులకు ఇవ్వాల్సిన 1500 కోట్ల పరిహారం గురించి చెప్పకుండా ఉత్తుత్తి ప్రారంభోత్సవాలు చేస్తే రైతులు సంతోషిస్తారా అని నిలదీశారు. వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి పొందడానికి 5 ఏళ్ల సమయం సరిపోలేదా జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి నిజంగా ప్రాజెక్టులు నిర్మిస్తే, తన హయాంలో ఎంత సొమ్ము ఖర్చుపెట్టి, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి, ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చాడనే పూర్తి సమాచారంతో తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్ పరిధిలోని రైతాంగం వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి, అతని ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

జగన్ ఉత్తుత్తి ప్రారంభోత్సవాలను ప్రజలు నమ్మరు: కందుల నారాయణరెడ్డి

వెలిగొండ పూర్తి చేశామంటే నమ్మేవారు లేరు: వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేశామని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అనడం పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేయడమేనని భారతీయ జనతా పార్టీ విమర్శించింది. పశ్చిమ ప్రకాశం జిల్లా, కడప, నెల్లూరు జిల్లా ప్రజలను వరప్రదాయిని వెలిగొండ ప్రాజెక్టు పూర్తీ కాకపోయినా అట్టహాసంగా ప్రారంభోత్సవం నిర్వహించడం మూమ్మాటికీ వంచమేనని ఆ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ఆరోపించారు. పూర్తి కాని ప్రాజెక్టులకు గేట్లు తెరిస్తే ఎలాంటి ప్రమాదం ఉంటుందనేది ఇటీవల ప్రజలందరూ చూశారని పేర్కొన్నారు.

కుప్పంకు శ్రీశైలం నుంచి నీరు అంటూ జగన్ అద్దెకు తెచ్చి ఎత్తిన గేటు ఎటు పోయిందని దినకర్‌ ప్రశ్నించారు. ఒక వైపు ప్రాజెక్టు గేట్లు ఎత్తామని చెప్పుకునేలోపే నిర్మాణంలో అవినీతి లోపాల వల్ల నీరు రోడ్డు పాలు అవుతోందన్నారు. గుండ్లకమ్మ పైన గేట్లు కొట్టుకు పోతే ఏడాదిగా కనీసం మరమ్మతులు చేయించలేని జగన్ ప్రభుత్వం వెలిగొండ పూర్తి చేశామంటే నమ్మే వారు ఎవరూ లేరన్నారు. ఈ ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తయ్యే బీజేపీ పోరాడుతుందన్నారు. జగన్‌ పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క జల ప్రాజెక్టు పూర్తీ కాలేదని, వెలిగొండ వద్దకు బీజేపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటించి వాస్తవాలను నిగ్గు తేలుస్తుందన్నారు.

అసంపూర్తిగా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు - నేడు ప్రారంభించడానికి జగన్ సిద్ధం

ABOUT THE AUTHOR

...view details