TDP Leaders Participated in Palle Panduga Program Across State : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఏలూరు జిల్లా నూజివీడు మండలం వెంకటాయపాలెంలో మంత్రి కొలుసు పార్థసారథి పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి పార్థసారథికి గిరిజనులు బంజారా నృత్యం చేస్తూ వినూత్నంగా స్వాగతం పలికారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాయంపల్లెలో 8 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి అధికారులతో కలసి టీడీపీ నాయకులు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. పల్లెల్లో పండుగ వాతావరణం తెచ్చేలా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆనాడు చంద్రబాబు స్పూర్తితో గ్రామాల్లో రోడ్లు వేశారని, జగన్ ప్రభుత్వం 12 వేల కోట్ల కేంద్రం నిధులను ఖర్చు చేయకుండా దారి మళ్లించారని ఆరోపించారు. పవన్‌కల్యాణ్ మంత్రిగా బాధ్యత తీసుకున్నాక గ్రామాలు అభివృద్ధి చేస్తున్నారన్నారు.
NRGS ఫండ్స్ తెచ్చి వంద రోజుల్లో రూ.4500 కోట్లతో అభివృద్ధి చేపట్టారని తెలిపారు. గతంలో పంచాయతీ ఆఫీస్‌లకు పార్టీ రంగులు వేసుకున్నారని మంత్రి విమర్శించారు. పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అంటే ఏమిటో? గ్రామ స్వరాజ్యం ఏమిటో చూస్తారని మంత్రి కొల్లురవీంద్ర అన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి అవసరమైన రహదారుల నిర్మాణానికి పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని వివిధ గ్రామాలలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం కింద మంజూరైన నిధులతో గ్రామాల్లో సిమెంట్ రహదారుల నిర్మాణానికి కలెక్టర్ ప్రశాంతితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో నిధులు మంజూరైన మొదటి నియోజకవర్గ నిడదవోలని వెల్లడించారు. నియోజకవర్గంలో 11 కోట్ల రూపాయలతో నిర్మించే పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీల సారధ్యంలో రాష్ట్రంలో సర్వతో ముఖాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.