TDP Leaders on Diarrhea Cases in AP: గుంటూరులో కలుషిత నీటి సరఫరాతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకరు మృతి చెందడం, డయేరియా కేసులు రోజు రోజుకూ పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచుతూనే మరోవైపు సరక్షితమైన తాగునీటి సరఫరాపై దృష్టి సారించింది. ఇది ఇలా ఉంటే నగరంలో డయేరియా కేసులు పెరగడంపై విపక్షాలు, ప్రభుత్వంపై దాడిని ఉద్ధృతం చేశాయి. అవినీతి, దోపిడీపై పెట్టే శ్రద్దను ప్రజారోగ్యంపై పెట్టాలని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలుషిత తాగి మృతి చెందిన బాధిత కుటుంబానికి, అనారోగ్యం పాలై చికిత్స పొందుతూ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని గుంటూరు టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో ప్రజలు ఇంకా కలుషిత నీరుతో డయేరియాకు గురికావడం ప్రభుత్వానికి సిగ్గు చేటని వారు మండిపడ్డారు. వందలాది మంది ఆస్పత్రిపాలవుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, తక్షణమమే ఉపశమన చర్యలకు దిగాలని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
డయేరియా అనుమానిత లక్షణాలతో మృతి చెందిన పద్మ కుటుంబానికి పరిహారం అందించాలని మంత్రి విడదల రజిని(Minister Vidadala Rajini) కి గుంటూరు తెలుగుదేశం నేతలు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్‌కు కూడా మెమోరాండం ఇచ్చారు. కలుషిత నీటి సరఫరా కట్టడికి చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత నసీర్ అహ్మద్(TDP leader Naseer Ahmed) డిమాండ్ చేశారు. బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే(MLA)కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.