TDP Leader Bonda Uma: తెలుగుదేశం - జనసేన పొత్తులో భాగమైన అంశాల గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడితే వైఎస్సార్సీపీకి ఎందుకని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామాహేశ్వర రావు ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాల గురించి చేసిన ప్రకటనలపై, వైఎస్సార్సీపీ నేతలు స్పందించడాన్ని బొండా తిప్పికొట్టారు.
పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్లనే పవన్ కల్యాణ్ ప్రకటించారని తేల్చి చెప్పారు. పవన్ ప్రకటించిన సీట్లపై తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. పొత్తులో భాగంగా తెలుగుదేశం - జనసేనలు సీట్లపై దాదాపు ఓ అవగాహనకు వచ్చేశాయని స్పష్టం చేశారు. మంచి రోజు చూసి ఉమ్మడిగా ప్రకటించటమే మిగిలి ఉందని తేల్చి చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సీట్ల కేటాయింపు పుకార్లు, సజ్జల కొడుకు భార్గవ్ నేతృత్వంలో పని చేసే ఐప్యాక్ రూపొందించిందే అని ఆరోపించారు.
'విచారణకు రండి' - టీడీపీ, వైఎస్సార్సీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు
పవన్ వ్యాఖ్యలపై స్పందించిన కాపు నేతలు ఏ ఒక్క రోజైనా కాపు రిజర్వేషన్లు, కాపు సంక్షేమం గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. తమపై విమర్శలు చేసే నేతలు వైఎస్సార్సీపీలో ఏ నేతకు సీటు గ్యారెంటీ ఉందో స్పష్టంగా చెప్పగలరా అని సవాల్ విసిరారు. అంతర్గత కుమ్ములాటలతో ఏం చేయలేక వైఎస్సార్సీపీ నేతలు జుట్టు పీక్కుంటున్నారని, టీడీపీ జనసేనల పొత్తు విచ్ఛిన్నమైతే చాలనుకుంటున్నారని విమర్శించారు.