TDP Allegations against CM Jagan:వచ్చే ఎన్నికల అనంతరం విశాఖ నుంచి పాలన సాగిస్తా, మళ్లీ గెలిచి వచ్చాక విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ రెడ్డి పగటి కలలు కంటున్నాడని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమి కొడదామని ఒక్క విశాఖ ప్రజలే కాదు యావత్ రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు.
ఎన్నికల వేల ఉత్తరాంధ్రపై ప్రేమ: జగన్ రెడ్డికి విశాఖ మీద అంత ప్రేమ ఉంటే, పరదాలు కట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని తెలుగుదేశం నేత అచ్చెన్నాయుడు నిలదీశారు. భటులు లేనిదే అడుగులు కూడా వేయలేని జగన్ రెడ్డి ఎన్నికల వేల ఉత్తరాంధ్రపై ప్రేమ వెలగబోస్తున్నాడని ధ్వజమెత్తారు. విశాఖలో 5 ఏళ్లల్లో 40వేల కోట్ల భూదోపిడీ జరిగిందని ఆరోపించారు. జగన్ రెడ్డి అతని చెడ్డి గ్యాంగ్ ఆ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రఖ్యాత కంపెనీలైన లూలూ, ఐబీఎం వంటి కంపెనీలను విశాఖ నుంచి తరిమేసి యువతకు ఉపాధి అవకాశాలను దూరం చేసిన కీచకుడు జగన్ రెడ్డి అని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.
కొండకు గుండు కొట్టి ప్యాలెస్ నిర్మించాడు: పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన నీచుడని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పర్యావరణ శాఖ వద్దని చెప్పినా వినకుండా రుషికొండను ఆక్రమించి కొండకు గుండు కొట్టి ప్యాలెస్‌లు నిర్మించుకున్నారని ఆక్షేపించారు. ఐటీ రంగంలో 1027.86 కోట్ల పెట్టుబడులతో 175 కంపెనీల ద్వారా 30,428 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉత్తరాంధ్ర అభివృద్ధికై బాటలు వేశామని గుర్తు చేశారు. విశాఖలోని రుషికొండ ఐటీ సెజ్‌లో నాడు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకువచ్చిన 14 కంపెనీలను జగన్ రెడ్డి తరిమేశాడని దుయ్యబట్టారు.
పొరుగు రాష్ట్రాలకు 17లక్షల కోట్ల పెట్టుబడులు: ప్రత్యేక హోదా కోసం పోరాడతానని ఎన్నికల ముందు చెప్పిన జగన్ రెడ్డి ఇప్పుడు తన కేసుల మాఫీ కోసం హోదాను, విశాఖ ఉక్కును తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ చిత్రపటం నుంచి రాజధానిగా అమరావతిని చెరిపేయడంతో పాటు 13 జిల్లాల అభివృద్ధిని జగన్ రెడ్డి చంపేశాడని మండిపడ్డారు. జగన్ రెడ్డి విధ్వంసకర పాలనకు భయపడి దాదాపు 17లక్షల కోట్ల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడంతో లక్షల మంది నిరుద్యోగులు రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ సమస్యను పక్కదారి పట్టించేందుకు విశాఖను రాజధానిగా ప్రకటించి ప్రజలను మభ్యకు గురి చేసే కుట్రకు జగన్ రెడ్డి తెర లేపారని విమర్శించారు.