TDP Jayaho BC Public Meeting at Mangalagiri: టీడీపీ- జనసేన కూటమి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో జరగనున్న జయహో బీసీ భారీ బహిరంగ సభలో ఉమ్మడి బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేయనున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. నేడు జరగనున్న ఈ సభకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి బీసీలు, టీడీపీ, జనసేన కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం నుంచి సుమారు 50 వాహనాలలో బీసీ సోదరులు ఈ కార్యక్రమానికి బయలుదేరారు. రాజకీయంగా వెనుకబడిన వర్గాలు ఎదగడానికి టీడీపీ ఇచ్చిన ప్రాధాన్యతను నేతలు వివరించనున్నారు. బీసీలలో చేతి వృత్తుల వారు అధికంగా ఉన్నందున ఆయా వర్గాల అభ్యున్నతికి చేపట్టే చర్యలను తెలియజేయనున్నారు. ఈ నేపథ్యంలో జయహో బీసీ సభ ఏర్పాట్లను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పరిశీలించారు.
జయహో బీసీ' సభ - బీసీలే తమ డిక్లరేషన్ రూపొందించుకునే అవకాశం టీడీపీ ఇచ్చింది"
బీసీల అభివృద్ధికి సంబంధించిన అంశాలను డిక్లరేషన్ ద్వారా చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ప్రకటిస్తారని అచ్చెన్నాయుడు తెలిపారు. పార్టీలకు అతీతంగా సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని కోరారు. సభకు ప్రభుత్వం అనేక ఆటంకాలు సృష్టిస్తోందని ఆరోపించారు. ఆర్టీసీ బస్సులు అద్దెకు అడిగితే ఇవ్వలేదన్నారు. కాలినడకనైనా బీసీలు తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే బీసీలకు ఇచ్చిన ప్రతిహామీని నిర్ధిష్ట ప్రణాళికతో అమలు చేస్తామనే హామీని జయహో బీసీ వేదిక ద్వారా డిక్లరేషన్ చేయనున్నట్లు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి వంచనకు గురైన బీసీలంతా ఏకదాటిగా ఈసారి గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.