Collector Fulfills CM Chandrababu Promise : పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఓ లబ్ధిదారుడికి సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని అధికారులు బుధవారం నెరవేర్చారు. వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం యలమంద గ్రామంలో మంగళవారం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఉల్లంగుల ఏడుకొండలు పింఛను అందుకున్నారు. యలమంద గ్రామంలో గాలి మిషన్ ద్వారా వాహన టైర్లకు గాలి నింపి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం గాలి మిషన్ పాడై సంపాదన ఇబ్బందిగా మారిందని పింఛను పంపిణీ కార్యక్రమానికి వచ్చిన సీఎం చంద్రబాబుకు ఏడుకొండలు విన్నవించుకున్నారు.
ఈ నేపథ్యంలో లబ్ధిదారునికి నూతన గాలి మిషన్ అందజేయాలని కలెక్టర్‌ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లబ్ధిదారుడు ఉల్లంగుల ఏడుకొండలుకు నూతన గాలి మిషన్‌ను కలెక్టర్ పి. అరుణ్ బాబు అందజేశారు. కార్యక్రమంలో నరసరావుపేట ఆర్డీవో మధులత, తహశీల్ధార్ వేణుగోపాల్, తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఈ క్రమంలో ఏడుకొండలు సీఎం చంద్రబాబు చేసిన సాయంపై ఆనందం వ్యక్తం చేశారు.
ఇదే కాకుండా హామీ ఇచ్చిన పలువురికి చంద్రబాబు సాయం అందిస్తున్నారు. డిసెంబర్ 20న కృష్ణా జిల్లాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా ఓ దివ్యాంగ యువకుడు తనకు సాయం చేయాలని కోరాడు. ”సార్, నేను ఆటోడ్రైవర్‌ని. మీరు సీఎంగా గెలిస్తే నాకు రేషనుకార్డు, దివ్యాంగ ఫించను ఇస్తారని జగన్ అభిమానితో శపథం చేశాను. మీరు సీఎం అయ్యాకనే జనం ముఖాల్లో నిజమైన నవ్వులు చూస్తున్నా" అని ఈడ్పుగల్లుకు చెందిన నువ్వుల సాయి కృష్ణా అనే వికలాంగ యువకుడు చంద్రబాబు ఎదుట చక్కగా మాట్లాడి ఆకట్టుకున్నాడు.
దీనిపై చంద్రబాబు యువకుడికి హామీ ఇచ్చారు. 72 గంటల వ్యవధిలోనే ఆ యువకుడికి రేషన్‌కార్డు, ఎలక్ట్రికల్ ఆటో ఇవ్వాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
2024 చరిత్ర తిరగరాసింది - అందరికీ భవిష్యత్‌పై భరోసా వచ్చింది: సీఎం చంద్రబాబు
అమరావతి అభివృద్ధి చెందే నగరం - ఇక సినిమాలన్నీ ఏపీలోనే: సీఎం చంద్రబాబు