TDP Condemn YSRCP Leaders Attacks :పోలింగ్ రోజు విధ్వంసం సృష్టించిన వైఎస్సార్సీపీ శ్రేణులు ఇప్పటికీ దాడుల పరంపరను కొనసాగిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలపై విరుచుకుపడుతున్నారు. ప్రజలు భయాంధోళనకు గురవుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ దాడులను టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఖండించారు.
నారా లోకేశ్ : ఓటమి భయం వైఎస్సార్సీపీ నేతలను నరరూప రాక్షసులుగా మార్చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. టీడీపీకి ఓటు వేశారనే అనుమానంతో తిరుపతి జిల్లా పెళ్లకూరుమిట్టకు చెందిన గర్భిణిపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నచ్చినట్లు ఓటు వేసే స్వేచ్ఛ కూడా లేకుండా చేసిన వైఎస్సార్సీపీ పతనం ఖాయమని స్పష్టంచేశారు. గర్భిణికి మెరుగైన వైద్యం అందించి నిందితులను అరెస్టు చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
అచ్చెన్నాయుడు :రాష్ట్రంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై వైఎస్సార్సీపీ శ్రేణుల వరుస దాడులను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతీవ్రంగా ఖండించారు. ఓటమి భయంతో వైఎస్సార్సీపీ శ్రేణులు నిరాశ, నిస్పృహలో కూరుకుపోయి దాడులకు తెగబడుతున్నాయని అన్నారు. వైసీపీ రౌడీమూకల అరాచకాలన్నింటికీ తప్పక సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. పల్నాడులో పిన్నెళ్లి సోదరుల అరాచకాల వల్ల 144 సెక్షన్ విధించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. భారీగా పోలీసుల్ని మోహరించి పిన్నెళ్లి రౌడీల నుంచి ప్రజల్ని కాపాడుకోవాల్సి వస్తోందన్నారు. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ అనుచరులపై వైసీపీ నేతలు రాడ్లతో దాడి చేశారని అన్నారు. అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి ఇంట్లోకి పోలీసులు చొరబడి టీడీపీ కార్యకర్తలు, నాయకులపై దాడి చేశారన్నారు. ఇంట్లో పని మనుషుల్ని కూడా ఎత్తుకెళ్లడం సిగ్గుచేటని అన్నారు. జగన్‌రెడ్డి గూండాల చేతుల్లో పోలీసులు కీలుబొమ్మలుగా మారారని మండిపడ్డారు. వందలాది మంది రౌడీలు రాడ్లు, కత్తులు పట్టుకుని వీరంగం సృష్టిస్తున్నారంటే రాష్ట్రంలో ఏం జరుగుతోందని నిలదీశారు. టీడీపీ కార్యకర్తపై జరిగిన ప్రతి ఒక్క దాడికీ వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.