TDP Complaint to EC on Pension:కదల్లేని పెన్షన్ దారులను వైసీపీ నేతలు మంచాల్లో ఊరేగించడాన్ని తెలుగుదేశం సీరియస్గా తీసుకుంది. కదల్లేని వాళ్లకు ఇళ్ల వద్దే పెన్షన్ ఇవ్వాలనే నిబంధనలున్నా, వైసీపీ నేతలు ప్రచారం కోసం వృద్ధులను ఇబ్బందులు పెడుతున్నారని టీడీపీ మండిపడింది. వైసీపీ (YCP) నేతల అకృత్యాలపై ఈసీకి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేయనుంది. సామాజిక మాధ్యమాల్లో తమపై విష ప్రచారం చేసేందుకు వైసీపీ నేతలు అరేంజ్డ్ వీడియోలు తీస్తున్నారని ఈసీ దృష్టికి తెలుగుదేశం తీసుకెళ్లనుంది.
ఎన్నికల సంఘానికి లేఖ రాసిన టీడీపీ: వైసీపీ కార్యకర్తలు మంచం పై వృద్ధులను మోసుకు వస్తూ ఈసీ ఆదేశాలు ధిక్కరిస్తూ ఉంటే అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య (Varla Ramaiah) మండిపడ్డారు. పింఛన్లపై ఇప్పటికీ నగదు సచివాలయంలోకి అందలేదని లేఖ ద్వారా ఎన్నికల సంఘానికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. వెంటనే నగదు విడుదల చేసి ఇళ్ళ వద్ద పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని టీడీపీ తరపున డిమాండ్ చేశారు.
వైసీపీ నేతలపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్: ఫించన్ల కోసం వృద్ధుల్ని ఇబ్బంది పెట్టడంలో అసలు కుట్రదారులు సీఎస్ జవహర్ రెడ్డి, సెర్ఫ్ సీఈవో మురళీధర్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ధనుంజయ్ రెడ్డి అని తెలుగుదేశం నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. వృద్ధులను మంచాలపై ఊరేగిస్తూ, ప్రతిపక్షాలపై విషప్రచారం చేస్తున్న వైసీపీ నేతలపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం వైసీపీ నేతలు, అధికారులు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కుట్రలో భాగస్వాములైన 9మంది అధికారులపై ఈసీ (election commission) చర్యలు తీసుకున్నా, మిగిలిన అధికారుల్లో మార్పు రాదా అని నిలదీశారు. అస్మదీయులకు ఖజానాను దోచిపెట్టడం వల్లే ఈనాటికీ ఫించన్ డబ్బు బ్యాంకుల్లో జమ కాలేదని ధ్వజమెత్తారు.