Varla Ramaiah writes to EC: ఎన్నికల విధుల్లోని ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి తమ పోస్టల్ బ్యాలెట్ ఓటు తప్పనిసరిగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలంటూ, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఈసీకి లేఖ రాశారు. పోలీసులు, డ్రైవర్లు, కండక్టర్స్, క్లీనింగ్ పర్సనల్స్ లాంటి ఓపీఓలకు శిక్షణ ఇవ్వకపోతే వారు పోస్టల్ బ్యాలెట్ ను సరిగా వినియోగించుకోలేరని లేఖలో ప్రస్తావించారు.
ఓట్లు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం: పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై ఓపీఓలకు శిక్షణ ఇవ్వాలని వర్ల రామయ్య ఈసీకి విజ్ఞప్తి చేశారు. 2019 సాధారణ ఎన్నికల లెక్కల ప్రకారం దాదాపు 56,545 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తిరస్కరించబడ్డాయని గుర్తు చేశారు. పోస్టల్ బ్యాలెట్ పత్రాలు ఎలా నింపాలో తెలియకే ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు తిరస్కరణకు గురయ్యాయని తెలిపారు. ఎన్నికల విధుల్లోని ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై సమగ్ర శిక్షణ ఇచ్చి ఓట్ల తిరస్కరణలు తగ్గించాలని కోరారు.
వారంతా ఎన్నికల విధుల్లో పాల్గొంటారు: ప్రతి నియోజకవర్గానికి దాదాపు 50 బస్సులు, 50 జీపులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నాయని వర్ల తెలిపారు. రాష్ట్రం మొత్తం దాదాపు 18,000 వాహనాలు ఎన్నికల విధుల్లో నిర్వహించబోతున్నాయన్నారు. ఎన్నికల విధులు నిర్వహించబోతున్న డ్రైవర్లు, వీడియోగ్రాఫర్లు, ఐటీ ఉద్యోగులను ముందుగా గుర్తించాలని సూచించారు. వారికి ఫామ్-12 తప్పనిసరిగా అందేలా చర్యలు తీసుకోవాలని వర్ల పేర్కొన్నారు. ఓపీఓలు ఫామ్-12 ను ఎవరికి సమర్పించాలనే దానిపై అనేక అనుమానాలు ఉన్నాయని వాటిని నివృత్తిచేయాలని వర్ల రామయ్య ఈసీని లేఖలో కోరారు.