Tax Revenue to Telangana State Exchequer :2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి నెల అయిన ఏప్రిల్‌లో, రాష్ట్ర ఖజానాకు రూ.11,818 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అందులో పన్నుల ద్వారా వచ్చిన మొత్తం రూ.11,464 కోట్ల రూపాయలు, కాగా పన్నేతర ఆదాయం రూ.354 కోట్లుగా ఉంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్- కాగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆదాయ, వ్యయ వివరాలు సమర్పించింది.
జీఎస్టీ ద్వారా అత్యధిక వసూళ్లు :గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో పన్నుల ద్వారా రాష్ట్రానికి రూ.9,698 కోట్ల రూపాయలు వచ్చాయి. అంటే, ఈ ఏడాది మొదటి నెలలో పన్ను ఆదాయం నిరుడితో పోలిస్తే రూ. 1,766 కోట్లు పెరిగింది. అత్యధికంగా జీఎస్టీ ద్వారా రూ. 4,475 కోట్లు రాగా, అమ్మకం పన్ను రూపంలో రూ. 2,661 కోట్లు సమకూరాయి. ఎక్సైజ్ పన్నుల రూపంలో రూ.1,580 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.1,116 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటాగా రూ.908 కోట్లు ఖజానాకు చేరాయి.
ఇతర పన్నుల రూపంలో మరో రూ.721 కోట్లు వచ్చాయి. ఏప్రిల్ నెలలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఒక్క రూపాయి కూడా నిధులు సమకూరలేదు. ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో రాష్ట్ర ప్రభుత్వం రుణాల ద్వారా 2,246 కోట్ల రూపాయలు సమకూర్చుకొంది. అన్ని రకాలుగా ఖజానాకు 14,068 కోట్ల రూపాయలు రాగా, అందులో ప్రభుత్వం రూ.13,918 కోట్లు ఖర్చు చేసింది. ఏప్రిల్ నెలలో వడ్డీల చెల్లింపుల కోసం రూ.1,865 కోట్లు, వేతనాల కోసం రూ.3,847 కోట్లు వ్యయం చేసింది.