Tax Evasion in Foreign Liquor Sales Scam Update : రాష్ట్రంలో 2016 అక్టోబరు 26న అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలైట్ షాప్ రూల్స్-2016 పేరిట ఓ జీవో ఇచ్చింది. ఈ జీవో ప్రకారం ఏర్పాటయ్యే దుకాణంలో ఫారెన్ వైన్, ఫారెన్ లిక్కర్, ఫారెన్ బీరుతో పాటు ఇండియన్ మేడ్ ప్రీమియం లిక్కర్, వైన్‌లు అమ్ముకోవచ్చని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి నిబంధనలు కూడా వెల్లడించింది.
ఆబ్కారీ శాఖకు చెందిన మద్యంపై వ్యాట్ విధింపు విషయమై వ్యాట్ చట్టం షెడ్యూల్ -6, ఎక్స్‌ప్లనేషన్-1 ప్రకారం తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కంపెనీ లిమిటెడ్ మాత్రమే చెల్లించాల్సి ఉంది. దీంతో ఎలైట్ టానిక్ మద్యం దుకాణానికి బయటి దేశాల నుంచి మద్యం దిగుమతి చేసుకునేందుకు వెసులుబాటు ఇచ్చినప్పటికీ, ఆ సరకును టీఎస్‌బీసీఎల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, లేబులింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా చేసినట్లయితే నిర్దేశిత 70 శాతం వ్యాట్ ప్రభుత్వానికి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ టానిక్ మద్యం దుకాణానికి ఎలైట్ షాపు పేరుతో ఇచ్చిన జీవోలో దుకాణదారులకు అనుకూలంగా అనేక వెసులుబాట్లు కల్పించారు.
విదేశీ మద్యం పేరుతో భారీగా 'పన్ను ఎగవేత' - సమగ్ర విచారణకు ప్రభుత్వ ఆదేశం
ఒకే పేరుతో 9 దుకాణాలు : హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్ చిరునామాతో అమిత్ రాజ్ లక్ష్మారెడ్డి పేరున ఈ టానిక్ మద్యం దుకాణం లైసెన్స్ ఉంది. టానిక్ మద్యం దుకాణం ఏర్పాటు చేసిన బంజారాహిల్స్‌లో సాధారణ మద్యం దుకాణానికి లైసెన్స్ ఫీజు రూ.1.10 కోట్లు ఉండగా, టానిక్ దుకాణం లైసెన్స్ ఫీజు మాత్రం రూ.1.25 కోట్లుగా ఉంది. అయితే ఈ టానిక్ మద్యం దుకాణానికి అనుబంధంగా మరో 9 మద్యం దుకాణాలు ఇదే బ్రాండ్ పేరుతో హైదరాబాద్ నగరంలో ఏర్పాటయ్యాయి. ఈ టానిక్ మద్యం దుకాణం ఏర్పాటు తెర వెనుక, గత ప్రభుత్వానికి చెందిన బడాబాబులు ఉండటంతో ఆబ్కారీ శాఖ అధికారులు కూడా ఈ జీవో గురించి కానీ, నియమ నిబంధనల గురించి కానీ పట్టించుకోలేదు.
తెర వెనక బడాబాబులు : ఆ దుకాణదారుడు మద్యం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాడు? ఏ ఏ రకాల మద్యం అమ్ముతున్నాడు? తెచ్చుకున్న మద్యానికి వ్యాట్ చెల్లిస్తున్నారా లేదా అన్న దానిపై కూడా అధికారుల వద్ద సమాచారం లేదు. దీనికి ప్రధాన కారణం ఆ దుకాణం అప్పటి పాలకులకు దగ్గరగా ఉన్న బడా బాబులకు చెందింది కావడమేనన్న విమర్శలు ఉన్నాయి. సాధారణ తనిఖీల్లో సైతం ఎలైట్ దుకాణం జోలికి వెళ్లకుండా అధికారులు మిన్నకుండి పోయారు. ఈ దుకాణదారుడు ట్యాక్స్ ఎగ్గొడుతున్నట్లు ప్రచారం జోరుగా జరగడంతో టానిక్ దుకాణంతో పాటు మరో 9 దుకాణాలపై ఆబ్కారీ శాఖ దాడులు నిర్వహించింది.
వెలుగులోకి మరో కుంభకోణం - రైతు బీమా, రైతుబంధులోనూ గోల్మాల్ - రూ.2 కోట్లు స్వాహా