Task Force Officers Inspect Seed Shops in Telangana : నైరుతి రుతుపవనాల రాకపై వాతావరణ శాఖ శుభవార్త అందించింది. దీంతో అన్నదాతలు సాగుకు సన్నద్ధమవుతున్నారు. పంట ప్రణాళిక మేరకు విత్తనాలు సమకూర్చుకునేందుకు యత్నిస్తున్నారు. ఇదే క్రమంలో పలు జిల్లాల్లోని విత్తన దుకాణాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆదిలాబాద్‌లో విత్తన నిల్వ గోదాములు, దుకాణాలను కలెక్టర్ పరిశీలించారు. జూన్ 2న తర్వాత రైతులు కోరిన అన్ని రకాలు విత్తనాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో కలెక్టర్ రాజీవ్ హన్మంతు తనిఖీలు నిర్వహించారు. రైతులకు బిల్లులివ్వని ఓ షాపు యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక, కర్నూలు తదితర ప్రాంతాల నుంచి నకిలీ విత్తనాలు రాకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. విత్తనాల కొరతపై అసత్య ప్రచారాలను నమ్మొద్దని నల్గొండ కలెక్టర్ దాసరి హరిచందన సూచించారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్న ఇద్దరు డీలర్లపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశారు. నకిలీ విత్తనాలు ఎవరైనా అమ్మితే వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోల్ ప్రీ నంబరు డయల్ చేయాలని తెలిపారు.
"ఫెర్టిలైజర్ అండ్ సీడ్స్ షాపుకు సంబంధించి గూడౌన్స్‌లో రెవెన్యూ అధికారి, ఒక పోలీసు అధికారిని ఉంచడం జరిగింది. షిఫ్టుల వారిగా వారు అందుబాటులో ఉంటున్నారు. ఇలా ఎందుకు పెట్టామంటే రైతులకు విత్తనాలు కచ్చితంగా చేరాలి. ఎక్కడైనా పక్కదారి పట్టకూడదు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. పది నుంచి 15 రోజులు పత్తి విత్తనాల విక్రయాలు ఉంటాయి."- రాజర్షి షా, ఆదిలాబాద్ కలెక్టర్