తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆన్​లైన్​లో లోన్​ తీయించి మరీ రూ. 30 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు - CYBER CRIME SCAM IN AP

ఇటీవల డిజిటల్​ అరెస్టుల పేరిట పెరిగిన మోసాలు - సైబర్​ నేరాలకు ఎక్కువగా గురవుతున్న ఉన్నత విద్యావంతులు - విజయవాడకు చెందిన ఓ యువతికి రూ. 30 లక్షల టోకరా

SOFTWARE ENGINEER IN CYBER CRIME
CYBER CRIME IN VIJAYAWADA (ETV bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 2, 2024, 3:28 PM IST

Recent Cyber Crime in AP :ఇటీవలి కాలంలో ఎక్కువగా డిజిటల్‌ అరెస్టుల పేరిట మోసాలు గణనీయంగా పెరిగాయి. ఉన్నత విద్యావంతులే ఎక్కువగా వీటి బారిన పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, వైద్యులు పెద్ద సంఖ్యలో సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసాలకు గురవుతున్నారు. తమ కష్టార్జితాన్ని క్షణాల్లో పోగొట్టుకుంటున్నారు. ఆర్బీఐ, సీబీఐ, కస్టమ్స్, పోలీసు తదితర ఏజెన్సీ అధికారులమని చెప్పి నమ్మించి, అరెస్టు చేస్తామంటూ బెదిరించి తమ ఖాతాలకు డబ్బులు బదిలీ చేయించుకుంటున్నారు.

విజయవాడకు చెందిన ఓ యువతి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగం చేస్తోంది. దీపావళి పండగ జరుపుకోవడానికి తన సొంతూరు వెళ్లింది. ఆమెకు మూడు రోజుల క్రితం ఓ కాల్‌ వచ్చింది. తాము ముంబయిలోని క్రైం బ్రాంచ్ పోలీసులమని ఫోన్‌లో వారు ఆమెకు తెలిపారు. మీ బ్యాంకు ఖాతా నుంచి అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని, విచ్ఛిన్నకర శక్తులకు డబ్బులు పంపించినట్లు గుర్తించామని మాట్లాడారు. అంతటితో ఆగకుండా మీ పేరిట వచ్చిన పార్సిల్‌లో మాదకద్రవ్యాలు ఉన్నట్లు తెలిసిందని ఆ మహిళ భయపడేలా బెదరగొట్టారు.

మీపై అరెస్టు వారెంట్‌ జారీ అయిందని తీవ్రంగా భయపెట్టారు. మరిన్ని వివరాలు వీడియో కాల్‌లో తమ డీసీపీ అధికారి మాట్లాడతారని స్కైప్‌లో కాల్‌ కనెక్ట్‌ చేశారు. అవతల పోలీసు స్టేషన్‌లా ఉన్న గదిలో యూనిఫాంలో ఉన్న వ్యక్తి మాట్లాడటం మొదలు పెట్టారు. రెండు రోజుల్లో పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్టు చేయబోతున్నారని ఆ యువతికి చెప్పారు. అరెస్టు చేయకుండా ఉండాలంటే తాము చెప్పిన బ్యాంకు ఖాతాకు డబ్బులు బదిలీ చేయాలని, అప్పుడే అరెస్టు ఆగుతుందని పోలీసు అధికారి వేషధారణలో ఉన్న వ్యక్తి గట్టిగా దబాయించాడు. ఎక్కువ సమయం లేదని ఆ యువతిపై ఒత్తిడి చేశాడు.

బలవంతంగా లోన్​ తీయించి : తన వద్ద డబ్బు లేదని సమాధానం ఇచ్చినా వారు కనికరించలేదు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు బ్యాంకులు పెద్ద మొత్తాల్లో రుణాలు ఇస్తాయని, మీకు ఎంత అర్హత ఉందో మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌లోకి వెళ్లి చూడమని సైబర్ నేరగాళ్లు సలహా ఇచ్చారు. వారు చెప్పినట్లే యాప్‌లోకి వెళ్లి రుణం కోసం యాప్‌లోనే దరఖాస్తు చేసుకోవడం, పది నిమిషాల్లో ఆమె ఖాతాలో నగదు జమకావడం జరిగిపోయింది. ఆమె వెంటనే మోసగాళ్లు చెప్పిన ఖాతాలకు రూ.20 లక్షలను బదిలీ చేసింది.

అంతటితో ఆగని మోసగాళ్లు మళ్లీ దీపావళి పండగ రోజు ఫోన్​ చేసి ఇంకా డబ్బులు కావాలని బెదిరించారు. ఆమె మరింత భయపడిపోయి గురువారం ఉదయం మరో రూ.10 లక్షలు వారి ఖాతాలకు ట్రాన్స్​ఫర్ చేసింది. ఇలా మొత్తం రూ.30 లక్షలను రెండు విడతలుగా పంపించింది. ఆ తర్వాత నేరగాళ్ల నంబరుకు ఫోన్‌ చేసేందుకు ప్రయత్నించగా స్విచాఫ్‌ అని వచ్చింది. దీంతో తాను మోసపోయినట్లు ఆమె గుర్తించి పోలీసులను ఆశ్రయించింది.

‘ ఇటీవలి కాలంలో దేశంలో చాలా మంది, వయస్సుతో సంబంధం లేకుండా డిజిటల్‌ అరెస్టుల బారిన పడుతున్నారు. భయంతో తమ కష్టార్జితాన్ని మోసగాళ్లకు చెల్లించుకుంటున్నారు. మీకు ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి ఎదురైతే భయాందోళనలకు గురికావొద్దు. దేశంలోని ఏ దర్యాప్తు ఏజెన్సీ నుంచి ఫోన్‌ కాల్స్‌ కానీ వీడియో కాల్స్‌ కానీ రావు.’

- మన్‌కీ బాత్‌లో సైబర్ నేరాలపై ప్రధాని మోదీ ప్రసంగం

డిజిటల్‌ రక్షణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమైన మూడు సూచనలు

  • ఆగండి: ఇటువంటి కాల్స్‌ వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండండి. భయపడి వ్యక్తిగత సమాచారాన్ని మోసగాళ్లకు అస్సలు ఇవ్వొద్దు. ఆ సమయంలో రికార్డు చేసుకోవడం మంచిది.
  • ఆలోచించండి : చట్టబద్ధ ఏజెన్సీలు వీడియో కాల్స్‌, ఫోన్‌కాల్స్ ద్వారా దర్యాప్తు చేయవు. డబ్బులు డిమాండ్‌ చేయవు.
  • స్పందించండి :నేషనల్‌ సైబర్‌ క్రైం హెల్ప్‌లైన్‌ నెంబరు 1930కు ఫిర్యాదు చేయండి. దీని కొరకు cybercrime.gov.in అనే వెబ్​సైట్​లో ఆధారాలను నమోదు చేయాలి.

ఆన్​లైన్ నేరాలపై కేంద్రం ఉక్కుపాదం - త్వరలో రంగంలోకి దిగనున్న సైబర్ కమాండోలు - Cyber Commandos Training

సైబర్​ నేరగాళ్ల వికృత చేష్టలు - టార్గెట్​ రీచ్​ కాకుంటే 15 అంతస్తుల భవనం 7సార్లు ఎక్కాలి - hyderabad man escape Laos cyber den

ABOUT THE AUTHOR

...view details