T-SAFE App For Women Safety: మహిళల కోసం ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన తెలంగాణ పోలీసులు ఇప్పుడు వారి భద్రత కోసం మరో ముందడుగు వేశారు. మహిళల భద్రత కోసం ఏకంగా ఓ అప్లికేషన్‌ను రూపొందించారు. ప్రజల భద్రత దృష్ట్యా పోలీసు శాఖ, ఉమెన్ సేఫ్టీ వింగ్ సంయుక్తంగా ‘టీ (ట్రావెల్)- సేఫ్’ యాప్‌ను రూపొందించాయి. ముఖ్యంగా మహిళలు, విద్యార్థినులపై ప్రయాణ సమయాల్లో ఆకతాయిల వేధింపులు అరికట్టడానికి ఇది ఉపయోగపడుతుంది.
తెలియని ప్రాంతాలకు ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఈ యాప్ తోడుగా ఉంటుంది గమ్యస్థానానికి వెళ్లే ముందు వివరాలను నమోదు చేసి మానిటరింగ్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి. గమ్యస్థానం చేరేంత వరకు పోలీసులు వారి ప్రయాణంపై నిఘా పెడతారు. యాప్ ద్వారా తమ సమస్యను తెలియజేస్తే చాలు వెంటనే వ్యక్తి లొకేషన్ ఆధారంగా దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌కు మెసేజ్ వెళ్తుంది. దీంతో పోలీసులు స్పందించి 5 నిమిషాలలో సంఘటన స్థలానికి చేరుకుంటారు.
తెలంగాణ ఆడపడుచులను ఆటపట్టించడం అంత ఈజీ కాదు!
మహిళలకు తోడుగా ట్రావెలింగ్ సేఫ్టీ యాప్ : ఇది దేశంలోనే మొదటి ట్రావెలింగ్ సేఫ్టీ యాప్ అని పోలీసులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ లేకపోయినా టీ-సేఫ్ సేవలు పొందవచ్చు. ప్రయాణానికి ముందు 100కు డయల్ చేసి ఐవీఆర్ ద్వారా ‘8’ నంబర్‌ను క్లిక్ చేసి వివరాలను తెలియజేస్తే సెల్ టవర్ ఆధారంగా వారి జాడను గుర్తిస్తారు. దీంతో ఏదైనా సమస్య ఎదురైతే తక్షణమే స్పందించే అవకాశం కలుగుతుంది. వెబ్ అప్లికేషన్ ద్వారానూ మానిటరింగ్ రిక్వెస్ట్ పెట్టొచ్చు. వెబ్‌సైట్‌లోకి వెళ్లి వెబ్ ట్రాకింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.