Samagra Kutumba Survey Questions In App : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులను గుర్తించేందుకు సర్వే కొనసాగుతోంది. సెల్ఫోన్లో యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సర్వే చేస్తున్నారు. ప్రజా పాలనలో ఇళ్ల కోసం మొత్తం 3,02,696 దరఖాస్తులు వచ్చాయి. అందులో అర్హులను గుర్తించేందుకు యాప్‌ను వాడుతున్నారు. తొలి విడతలో సొంత స్థలం ఉన్నవారికి ప్రభుత్వం రూ.5 లక్షలు అందిస్తామని ఇదివరకే స్పష్టం చేసింది. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందనుంది.
ఒకవైపు సర్వే - మరోవైపు యాప్ ఇబ్బందులు : ఒకవైపు సర్వే చేస్తుండగా మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల ప్రత్యేక యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. వివరాలు నిక్షిప్తం చేసే సమయంలో సర్వేయర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజా పాలన దరఖాస్తులో రాసిన చిరునామాకు వెళ్తే కొందరు అందుబాటులో ఉండడం లేదు. సమయానికి వారు దొరకడం లేదు. అప్లికేషన్లో రాసిన సెల్‌ఫోన్ నంబర్ పని చేయడం లేదు. ముఖ్యంగా శివారు గ్రామాల్లో యాప్ తెరుచుకోవడం లేదు. దీంతో సర్వే చేసే వారికి వివరాలు పొందుపరచడం ఇబ్బందిగా మారింది. ఇదిలా ఉండగా అధికారులు ఈ నెల 31లోపు సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. సాంకేతిక ఇబ్బందుల కారణంగా గడువులోగా సర్వే పూర్తి చేయడం సందేహంగానే ఉంది.