తెలంగాణ

telangana

ETV Bharat / state

మేం జోక్యం చేసుకోలేం - గ్రూప్‌-1 పిటిషన్ల​పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

గ్రూప్‌-1 అభ్యర్థుల పిటిషన్లపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ - ఫలితాల విడుదలకు ముందే ఈ కేసులో తుది విచారణ ముంగించాలని హైకోర్టుకు సూచన

SC ON TELANGANA GROUP 1
SUPREME COURT ON TGPSC GROUP 1 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 21, 2024, 1:20 PM IST

Updated : Oct 21, 2024, 2:21 PM IST

Supreme Court on Group 1 Petition Today : గ్రూప్‌ 1 పరీక్షలను నిలుపుదల చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై జోక్యం చేసుకునేందుకు, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ ముగిస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తమ తుది తీర్పునకు లోబడే నియామకాలు జరపాల్సి ఉంటుందని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పిందన్న సీజేఐ, అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లో ఉన్న సమయంలో జోక్యం చేసుకోవడం భావ్యం కాదని వ్యాఖ్యానించారు.

దాదాపు 14 సంవత్సరాల తర్వాత గ్రూప్‌ 1 పరీక్ష జరుగుతోందని, 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలిసారి పరీక్ష జరుగుతోందని అభ్యర్థుల తరపు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో 29 తీసుకువచ్చిందని, ఆ కారణంగా వేల మంది పరీక్షకు దూరం అయ్యారని, వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వారు కూడా ఉన్నారని తెలిపారు. తమకు కూడా పరీక్ష నిర్వహించాలని, అందుకు అనుగుణంగా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని సిబల్‌ కోరారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌ రెడ్డి సమాధానం ఇచ్చారు.

ఫలితాల విడుదలకు ముందే తుది విచారణ :గ్రూప్‌ 1 పరీక్ష నిర‌్వహణపై రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, హైకోర్టు తుది తీర్పునకు లోబడి తదుపరి చర్యలు ఉండాలని ఆదేశాల్లో ఉందని, అందుకు అనుగుణంగానే తాము గ్రూప్‌ 1 పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తరపు సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌ రెడ్డి చెప్పారు. ఇరువురి వాదనలు అనంతరం పిటిషన్లపై వాదన ముగిస్తున్నట్లు సీజేఐ ప్రకటించారు. అన్ని విషయాలు రాష్ట్ర హైకోర్టు చూసుకుంటుందని, ఈరోజు జరిగే పరీక్షను నిలుపుదల చేయడం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఒక వైపు అభ్యర్దులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్న ఈ పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోవడం భావ్యం కాదని సీజేఐ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై హైకోర్టులో విచారణ ఇంకా పెండింగ్‌లో ఉన్నందున హైకోర్టు తుది విచారణ చేపడుతుందని పేర్కొన్నారు. నవంబర్‌ 20లోపు గ్రూప్‌ 1 వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై తుది విచారణ ముగించి, తీర్పు ఇవ్వాలని సీజేఐ ధర్మాసనం హైకోర్టుకు సూచించింది. ఫలితాల విడుదలకు ముందే ఈ కేసులో తుది విచారణ ముంగించాలని కూడా ధర్మాసనం హైకోర్టుకు సూచనలు చేసింది.

గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్ - సింగిల్‌ బెంచ్‌ తీర్పును సమర్థించిన హైకోర్టు

Last Updated : Oct 21, 2024, 2:21 PM IST

ABOUT THE AUTHOR

...view details