SC on Jagan Illegal Assets Case :వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలు అందించాలంటూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుల పూర్తి వివరాలను 2 వారాల్లోగా అందించాలని, కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు ఇవ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలందించాలని ఆదేశించింది. ఈడీ, సీబీఐ కేసుల వివరాలను విడివిడిగా చార్ట్ రూపంలో అందించాలని పేర్కొంది. అన్ని వివరాలతో అఫిడవిట్లు రెండు వారాల్లో దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.
జగన్ అక్రమాస్తుల కేసు ట్రయల్ ఆలస్యమవుతోందని, కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఏపీ ఉప సభాపతి రఘురామ కృష్ణరాజు గతంలో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఇవాళ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం విచారణ జరిపింది. వాదనల సందర్భంగా రోజువారీ పద్ధతిలో విచారణకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశించినట్లు ఇరుపక్షాల న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ట్రయల్ ఇన్నేళ్లపాటు ఎందుకు ఆలస్యమవుతుందని ధర్మాసం ప్రశ్నించింది.