ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు - పేర్లు సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం - TWO NEW JUDGES TO AP HIGH COURT

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు ఇద్దరి పేర్లు - సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫారసు

SUPREME COURT COLLEGIUM RECOMMENDS
Two New Judges To AP High Court (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 16, 2025, 9:44 AM IST

Two New Judges To AP High Court :న్యాయాధికారుల కోటా నుంచి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు ఇద్దరి పేర్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. ‘సుప్రీం’ కొలీజియం హరిహరనాథ శర్మ, డాక్టర్‌ లక్ష్మణరావు పేర్లను సిఫారసు చేసింది. వీరి నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరనుంది.

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరి పేర్లు : ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు ఇద్దరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. కొలీజియం సిఫారసు చేసిన వారిలో ప్రస్తుతం ఏపీ జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న న్యాయాధికారి అవధానం హరిహరనాథ శర్మ, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌(ఆర్‌జీ)గా పనిచేస్తున్న న్యాయాధికారి డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావు పేర్లు ఉన్నాయి. వీరి పేర్లకు కేంద్రం ఆమోదముద్ర వేశాక ప్రధాని కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరతాయి. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీచేస్తుంది. వీరిరువురి నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరుతుంది. మరో ఏడు జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ నేతృత్వంలోని కొలీజియం వీరిరువురి పేర్లతోపాటు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి(పీడీజే)గా పనిచేస్తున్న జునైద్‌ అహ్మద్‌ మౌలానా పేరును గతంలో సుప్రీంకోర్టుకు సిఫారసు చేసింది. జునైద్‌ విషయంలో సుప్రీం కొలీజియం ఏ నిర్ణయం తీసుకుందో తెలియాల్సి ఉంది.

అవధానం హరిహరనాథ శర్మ :సుబ్బమ్మ, రామచంద్రయ్య దంపతులకు అవధానం హరిహరనాథ శర్మ 1968 ఏప్రిల్‌ 16న జన్మించారు. స్వస్థలం కర్నూలు. తండ్రి పురోహితులు. కర్నూలులోని ఉస్మానియా కళాశాలలో శర్మ బీఎస్సీ పూర్తి చేశారు. నెల్లూరు వీఆర్‌ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం చదివారు. 1994లో న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. కర్నూలు జిల్లా కోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. సీనియర్‌ న్యాయవాది రామకృష్ణారావు వద్ద వృత్తి మెలకువలు నేర్చుకున్నారు. 1998లో సొంతగా ప్రాక్టీసు ప్రారంభించారు. 2007 అక్టోబర్‌లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఉమ్మడి ఏపీలోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో న్యాయ సేవలు అందించారు. 2017-18లో అనంతరపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా(పీడీజే), 2020-22లో విశాఖ పీడీజేగా పనిచేశారు. 2022లో హైకోర్టు రిజిస్ట్రార్‌గా సేవలు అందించారు. 2023 నుంచి ఏపీ జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

యడవల్లి లక్ష్మణరావు : పద్మావతి, వెంకటేశ్వర్లు దంపతులకు డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావు 1975 ఆగస్టు 3న జన్మించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరి స్వస్థలం. ప్రాథమిక విద్య ప్రకాశం జిల్లాలో సాగింది. నెల్లూరు వీఆర్‌ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. క్రిమినల్‌ లా, కంపెనీ లాలో బంగారు పతకాలు సాధించారు. 2000 సంవత్సరంలో న్యాయవాదిగా పేరు ఎన్‌రోల్‌ చేసుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కావలిలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 2014లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఈ పోటీ పరీక్షలో రాష్ట్ర మొదటి ర్యాంక్‌ సాధించారు. ఏలూరులో అదనపు జిల్లా జడ్జిగా మొదట పనిచేశారు. ఆ తర్వాత ఉమ్మడి ఏపీలోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాలో న్యాయసేవలు అందించారు. నాగార్జున వర్సిటీ నుంచి పీజీ పూర్తి చేసి మెరిట్‌ సర్టిఫికేట్లు రెండు సాధించారు. ఏయూ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. 2021లో హైకోర్టు రిజిస్ట్రార్‌(జ్యుడీషియల్‌)గా నియమితులయ్యారు. ఆ తర్వాత రిజిస్ట్రార్‌ జనరల్‌(ఆర్‌జీ)గా నియమితులై ప్రస్తుతం కొనసాగుతున్నారు.

ఏపీ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

అసభ్య పోస్టులు పెట్టే వారిపై కేసులు నమోదు చేయడం తప్పేంకాదు: ఏపీ హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details