Poor Quality Food Items in Anganwadi : రాష్ట్రంలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే బాలింతలు, గర్భిణులు, చిన్నారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. పేదల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలనే సంకల్పంతో ఏర్పడిన అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేసే సరకుల పంపిణీ గుత్తేదారుల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా జరుగుతోంది. అంగన్‌వాడీ టీచర్లు గత్యంతరం లేక అవే సరకులతోనే భోజనం వడ్డించాల్సి వస్తోంది.
రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే ఉప్పు, పప్పు, చింతపండు, పాలు లాంటి సరకులకు ప్రభుత్వం నిర్దిష్టమైన పరిణామాలను నిర్దేశించింది. వాటితోనే ఓపూట భోజనం చేయాల్సి ఉంది. గర్భిణీలు, బాలింతలు ఓ పూట భోజనానికి 150 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పు, 50 గ్రాములు కూరగాయలు 16 మిల్లీ లీటర్ల నూనె, మరో 200 మిల్లీ లీటర్ల పాల చొప్పున సరఫరా చేస్తోంది. అదే చిన్నారుల కోసమైతే ఓ పూట భోజనానికి 75 గ్రాముల బియ్యం, 15 గ్రాములు పప్పు, 25 గ్రాముల కూరగాయలు, 5 మిల్లీ లీటర్ల నూనె సరఫరా చేస్తోంది.
సరకుల నాణ్యతలో లోపం వల్ల ఆరోగ్యంపై ప్రభావం : హైదరాబాద్‌కు చెందిన గుత్తేదారులు సరఫరా చేసే సరకుల నాణ్యతను జిల్లా స్థాయిలో పరిశీలించే వ్యవస్థే లేదు. సరకుల నాణ్యతను పరిశీలించకుండా వడ్డిస్తే మాతా శిశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంటే, అదంతా హైదరాబాద్ స్థాయి నుంచి జరుగుతుందనే మాట ఐసీడీఎస్ అధికారుల నుంచి వినిపించటం విస్మయానికి గురి చేస్తోంది.