Summer Heat Waves in Andhra pradesh:రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరుగుతోంది. రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వడగాలుల తీవ్రత కూడా మరింత పెరగనుంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదుకానుంది. వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. ఉదయం 7 గంటల నుంచే వేడి వాతావరణం మొదలవుతుంది. దీంతో వృద్ధులు, పిల్లలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్న సమయంలో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఎండలు పెరుగుతున్నాయి- ఈ నెలలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు?: వాతవరణ శాఖ
Heat waves in Several Districts: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. వివిధ జిల్లాల్లో 130 మండలాల్లో వడగాలులు విస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. శ్రీకాకుళం 4, విజయనగరం 19, పార్వతీపురంమన్యం 12, అల్లూరి 4, అనకాపల్లి 13, కాకినాడ 9, తూర్పుగోదావరి 3, కృష్ణా 1, ఎన్టీఆర్ 14, గుంటూరు 5, పల్నాడు 6, నంద్యాల 19, అనంతపురం 1, వైఎస్సార్ 20 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో బుధవారం అత్యధికంగా వైఎస్సార్ జిల్లాలోని కడప, ఒంటిమిట్ట, సిద్ధవటం ప్రాంతాల్లో 43.4 డిగ్రీలు, ప్రకాశం జిల్లా దరిమడుగు, నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరులో 43.3 డిగ్రీలు, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లి మండలంలో తీవ్ర వడగాలులతో ప్రజలు ఆందోళన చెందారు. జిల్లాలోని మరో 59 మండలాల్లో వడగాలులు వీచాయి. గురువారం రాష్ట్రంలో 130 మండలాల్లో వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.