CM Chandrababu Review on Electricity Department at Secretariat: ఏపీలో ప్రతి ఇల్లు, కార్యాలయం సౌరశక్తి ఉత్పత్తి కేంద్రాలుగా మారాలని సీఎం చంద్రబాబు అన్నారు. విద్యుత్ ఉత్పత్తి - వినియోగంలో స్వావలంబన దిశగా అడుగులు వేయాలని అన్నారు. రాష్ట్రం సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కావాలని పూర్తిస్థాయి వినియోగానికి అవసరమైన ప్రణాళికలు సత్వరం అమల్లోకి తేవాలని అధికారులను ఆదేశించారు. సోలార్ విద్యుత్ ప్రయోజనాలను ప్రజలకు వివరించి సోలరైజేషన్‌లో నిర్దేశిత లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో సౌరవిద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో భాగంగా చేపట్టిన కార్యక్రమంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
సోలార్ అమర్చుకునే వారికి రాయితీ: పీఎం సూర్యఘర్, ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ విద్యుత్ పరికరాల ఏర్పాటుతోపాటు ఎస్సీ, ఎస్టీల గృహాలకు సోలార్ సౌకర్యం కల్పించడంపై సీఎం చర్చించారు. కుసుమ్ పథకం, సోలార్ విలేజ్‌పైనా చర్చ జరిగింది. "పీఎం సూర్యఘర్ – ముఫ్త్ బిజిలీ యోజన" కింద ఏడాదిలో కోటి గృహాలను ఈ పథకం పరిధిలోకి తేవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో 30 లక్షల ఇళ్లు రాష్ట్రం నుంచే ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు. సోలార్ రూఫ్ టాప్ అమర్చుకునే వారికి కేంద్రం భారీగా రాయితీలు ఇస్తోంది. ఒక కిలో వాట్‌కు 50 వేలు ఖర్చవుతుండగా 30 వేలు సబ్సిడీ అందుతుంది. 2 కిలో వాట్లకు లక్ష ఖర్చయితే 60 వేల సబ్సిడీ, 3 కిలోవాట్లకు లక్షా 45 వేలు వ్యయమైతే 78 వేల సబ్సిడీ ద్వారా వస్తుంది. రాష్ట్రంలో ఈ పథకానికి 6 లక్షల 33 వేల 45 మంది రిజిస్టర్ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పీఎం సూర్యఘర్‌కు 70,110 ధరఖాస్తులు రాగా 4,961 ఇళ్లపై సోలార్ ప్యానల్స్ అమర్చినట్లు చెప్పారు.
పైలట్ ప్రాజెక్టుగా కుప్పం: 100 శాతం సోలార్ విద్యుత్ కార్యక్రమానికి కుప్పం నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. దీనిపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. కుప్పం పరిధిలో 50,314 ఇళ్లు సౌరవిద్యుత్ ప్యానళ్లు అమర్చేందుకు అనుకూలంగా ఉండగా 50,312 మంది గృహ యజమానులు అంగీకారం తెలిపినట్లు చెప్పారు. కుప్పం నియోజవర్గంలో 2 కోట్ల 66 లక్షల 15 వేల 521 చదరపు అడుగుల విస్తీర్ణంలో సోలార్ రూఫ్‌టాప్ విద్యుత్ ఉత్పత్తికి అవకాశం లభిస్తుందన్నారు. కుప్పం రెస్కో ప్రాజెక్టుకు రూ.286 కోట్లు వ్యయమవుతుండగా రూ.172 కోట్లు కేంద్రం నుంచి సబ్సిడీగా అందుతోంది.
మిగిలిన రూ.114 కోట్లను లబ్ధిదారులు రుణంగా పొందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలపై సౌర పలకలు ఏర్పాటుచేస్తే 100 మెగావాట్లకు 349 కోట్ల నుంచి 379 కోట్లు విద్యుత్ బిల్లుల రూపంలో ఆదా కానుంది. లక్ష యూనిట్లకు పైగా విద్యుదుత్పత్తి లక్ష్యంతో సోలార్ రూఫ్‌టాప్స్ కోసం 2,186 ప్రభుత్వ కార్యాలయాల్ని గుర్తించారు. 19 లక్షల 53 వేల 369 చదరపు మీటర్ల పరిధిలో రూ.262.25 కోట్ల వ్యయంతో సౌర విద్యుత్ పలకలు ఏర్పాటుచేస్తే ఏడాదికి 2 లక్షల 62 వేల 252 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై స్పష్టత ఇచ్చిన పీపీఏ - రెండు దశల ప్రస్తావన లేదని వెల్లడి
100 శాతం ఇళ్లలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి: పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఈ పథకం ద్వారా 20.38 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ఈ గృహాలకు సోలార్ రూఫ్‌టాప్ ప్యానెల్స్ అమర్చే అంశాన్ని పరిశీలిస్తోంది. అయితే 81 శాతం ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుచేసే వెసులుబాటు లేదు. మొదటి విడతలో మిగిలిన 19 శాతం గృహాలపై ప్యానెళ్లు పెట్టే అవకాశం ఉందంటూ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే కుసుమ్ పథకం కింద 14 లక్షల 94 వేల 453 వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ ప్యానల్స్ అమర్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
కుసుమ్ ఫేజ్-1 కింద 3 వేల 572 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మొత్తం 132 గ్రామాలను సోలార్ విలేజెస్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ గ్రామాల్లో 100 శాతం ఇళ్లలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. సోలార్ గ్రామాలకు కేంద్రం కోటి రూపాయల సాయం అందించనుంది. ఈ పథకం అమలుపై వేగంగా చర్యలు చేపట్టాలన్న సీఎం, విద్యుత్ బిల్లల భారం తప్పడంతో పాటు ఉత్పత్తి ద్వారా ఆదాయం ఆర్జించే అవకాశాన్ని ప్రజలకు కల్పించవచ్చని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 55 వేల ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయని అధికారులు చెప్పగా వీటిలో ట్రాన్స్‌పోర్ట్, వ్యక్తిగత వాహనాలకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
చిక్కీ డబ్బులు కూడా చెల్లించని జగన్.. ఇప్పుడు సుద్దపూసలా కబుర్లు చెబుతున్నాడు: మంత్రి లోకేశ్