Disadvantages of aluminum cookware : వంట పదార్థాలే కాదు అందుకు ఉపయోగించే పాత్రల ఎంపిక కూడా కీలకం అంటున్నారు నిపుణులు. అల్యూమినియం పాత్రల వాడకంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. డెన్మార్క్ దేశంలో దాదాపు 200 ఏళ్ల కిందట ఆవిష్కరించిన ఈ అల్యూమినియం(సత్తు)ను పలు దేశాల్లోకి విస్తృతంగా ఎగుమతి అయ్యింది. దీని రాకతో అప్పటి వరకు ఉన్నటువంటి మట్టి, ఇత్తడి, కంచు, రాగి పాత్రలు కనుమరుగైపోయాయి.
పిల్లల షూ ఎలా క్లీన్ చేయాలి? - వాషింగ్ మిషన్లో వేయొచ్చా!
అల్యూమినియం లోహాన్ని 1825లో మొట్టమొదటి సారిగా డెన్మార్క్ శాస్త్రవేత్త కనుగొన్నారు. భారత్‌లో 1938లో 'ఇండియన్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్' అనే సంస్థ ఉత్పత్తిని ప్రారంభించడంతో వాడకం విస్తృతమైంది. తక్కువ ధరకే లభిస్తుండడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఆకర్షితులయ్యారు. ఈ నేపథ్యంలో పాత్రల వాడకం అనతి కాలంలోనే పెరిగిపోయింది. ఈ పాత్రల్లో చేసిన వంటకాల్లో అతిసూక్ష్మ మోతాదుల్లో అల్యూమినియం కరిగి ఉంటుందని, ఆహారం ద్వారా శరీరాల్లోకి ప్రవేశిస్తుందని పలు పరిశోధనలు తేల్చాయి. అల్యూమినియం పాత్రల వాడకంతో ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుందని వైద్యులు సైతం వెల్లడించారు.
ఐరన్, మెగ్నీషియం, కాల్షియం వంటి మూలకాలు శరీర నిర్మాణ ప్రక్రియకు అవసరం. ఇందులో అల్యూమినియం పాత్ర ఏమీ లేదు. ఈ నేపథ్యంలో అల్యూమినియం లోహం అధికభాగం మూత్ర విసర్జన రూపంలో బయటికి వెళ్లిపోతుంది. కడుపులోకి వెళ్లిన అల్యూమినియంలో 0.01% నుంచి 1% వరకూ జీర్ణకోశం శోషించుకోగా, మూత్ర పిండాల ద్వారా వెళ్లగొడతాయి. కణజాలాల్లో పేరుకునే స్వభావం కారణంగా ఎముకలు, మెదడు వంటి శరీర అవయవాలు దెబ్బతినే ప్రమాదముందని, దీర్ఘకాల కిడ్నీజబ్బుతో బాధపడేవారికి మరింత హాని చేస్తుందని వైద్యులు వెల్లడించారు.
రక్తహీనత సమస్య
టమాటా, చింతపండు మన వంటల్లో నిత్యం వాడుకునేవే. కానీ, వీటితో పాటు నిమ్మ వంటి పుల్లటి పదార్థాలతో చేసే వంటకాల్లో అల్యూమినియం ఎక్కువగా కరుగుతుందట. మానవ శరీర నిర్మాణ ప్రక్రియలో ఇనుము, మెగ్నీషియం, కాల్షియం వంటి మూలకాలు అవసరం కాగా, రోజురోజుకూ శరీరంలో పేరుకుపోతున్న అల్యూమినియం మన దేహానికి ఉపయోగ పడకపోగా అడ్డంకిగా మారుతుంది. దీంతో రక్తహీనత సమస్యతో పాటు ఎముక మెత్తబడటం (ఆస్టియోమలేషియా), డయాలిసిస్ ఎన్‌కెఫలోపతి (ఇది దీర్ఘకాలంగా డయాలిసిస్ చేయించుకునేవారిలో వచ్చే సమస్య) అనే నాడీ మండల వ్యాధికి కారణమవుతుందని వైద్యులు గుర్తించారు.
వ్యాధులకు మూలం
మెదడులో అల్యూమినియం లోహం మోతాదుకు మించి పేరుకుపోతే 'డయాలిసిస్ ఎన్‌కెఫలోపతి' లేదా '‘డయాలసిస్ డిమెన్షియా' వ్యాధికి గురయ్యే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు. ఈ స్థితికి చేరిన వ్యక్తుల్లో మాట సరిగ్గా రాకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, శరీర కదలికల్లో మార్పు, ప్రవర్తనలో తేడా వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయి. అంతేకాదు అల్జీమర్స్, రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులకు కూడా ఇది మూలమని తెలుస్తోంది. సహజంగా ఒక మనిషి వారానికి తమ బరువులో ప్రతి కిలోకు 2 మిల్లీ గ్రాముల వరకు అల్యూమినియం తీసుకున్నా శరీరం తట్టుకోగలదని యూఎన్ఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ), డబ్ల్యూహెచ్ఓ ప్రకటించాయి. అంతకు మించి శరీరంలో నిల్వ ఉంటే అనారోగ్యాలు తప్పవంటున్నారు.
ఎలా ఉండాలంటే!
మనిషి శరీరంలోకి ఈ లోహం చేరడానికి అతిపెద్ద కారణం వంట పాత్రలు, అల్యూమినియం ఫాయిల్సే. ఇవి స్టీల్ పాత్రలతో పోలిస్తే మూడో వంతు సాంద్రత కలిగి ఉండి చాలా తేలిగ్గా ఉంటాయి. దీనికి మాంగనీసు, రాగి, జింక్ వంటివి జతచేసి మిశ్రమ లోహంతో తయారు చేస్తే మన్నిక ఉంటుంది. అల్యూమినియం వంటపాత్రలకు సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) కొన్ని ప్రమాణాలను సూచించింది. పాత్రలు కొనేటప్పుడు వాటిని గమనించాలి. వంటపాత్రల కోసం ఉపయోగించే అల్యూమినియం, దాని మిశ్రమ లోహాలు దళసరిగా, నునుపుగా ఉండాలి. పాత్రల ఉపరితలం నునుపుగా ఉండటానికి వాటిపై అల్యూమినియం ఆక్సైడ్‌తో పైపూత పూసి ఉండాలి. లేదా యానోడైజేషన్ అనే ప్రక్రియ ద్వారా పాత్రల్ని దళసరిగా మార్చి ఉండాలి.
ఆ పాత్రలన్నీ ప్రమాదకరమా?
పాత్రలో వండుతున్న పదార్థాల ఆమ్లత లేదా క్షారత (పీహెచ్), ఎంత ఉష్టోగ్రతపై వంట చేశారు, ఏ నూనె వాడారు, పాత్రను ఎంత సేపు పొయ్యిపై ఉంచారు వంటి అంశాలు వంటకంలో కలిసే అల్యూమినియం మోతాదును నిర్ణయిస్తాయి. ముఖ్యంగా పుల్లటి పదార్థాల్లో ఈ లోహం ఎక్కువగా కరుగుతుంది. ఒక అధ్యయనంలో మూత్రపిండాల రోగంతో బాధపడుతున్న 30 మందికి 3 నెలల పాటు కేవలం స్టీలు పాత్రల్లో చేసిన వంటకాలు అందించారు. అదే కాలంలో మరో 12 మందికి అల్యూమినియం పాత్రల్లో చేసిన వంటకాలు పెట్టారు. స్టీలు పాత్రల్లో చేసిన వంటకాలు తిన్న వారి రక్తంలో, మూత్రంలో అల్యూమినియం పాళ్లు భారీగా తగ్గినట్టు గుర్తించారు.
కిడ్నీ జబ్బు బాధితులకు ప్రమాదమే
దీర్ఘకాలం కిడ్నీజబ్బులతో బాధపడేవారు అల్యూమినియం పాత్రలకు దూరంగా ఉండడమే మేలు. వీటిల్లో వండినప్పుడు అల్యూమినియం వంటకాల్లోకి లీక్ అవుతుంది. (నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఆహార పదార్థాలతో పాటే ఇదీ కడుపులోకి వెళ్తుంది. అప్పుడు రక్తంలో అల్యూమినియం మోతాదులు పెరుగుతాయి. కిడ్నీజబ్బు గలవారిలో మూత్రపిండాలు దీన్ని సరిగా బయటకు వెళ్లగొట్టలేవు. అప్పుడది కణజాలాల్లో, అవయవాల్లో పోగుపడుతుంది. ఎముకల్లో పోగుపడితే ఎముకల జబ్బు, ఎముకమజ్జలో చేరుకుంటే రక్తహీనత, నాడీకణజాలంలో పేరుకుంటే డిమెన్షియా వంటి జబ్బులకు దారితీస్తుంది. వంటపాత్రలు ఒక్కటే కాదు.. చాలా రకాల యాంటాసిడ్ మాత్రల్లోనూ అల్యూమినియం ఉంటుంది. అందువల్ల కిడ్నీజబ్బు గలవారు ఇలాంటివి వాడకుండా చూసుకోవాలి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రూ.40కోట్లు పలికిన 'నెల్లూరు ఆవు' - బహిరంగ వేలంలో ప్రపంచ రికార్డు
ఇంద్రధనస్సులో రంగులు సీతాకోక చిలుకలకు ఎలా వచ్చాయి? - ఎంతో ఆసక్తికరం