Summer Heat Waves in Andhra pradesh: రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. వడగాలులతో అధిక వేడి పెరుగుతోంది. గురువారం ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2.6 డిగ్రీల నుంచి 2.9 డిగ్రీల వరకు పెరిగాయి. ముఖ్యంగా రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు (Temperatures) 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లోనూ వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
'వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వడగాల్పులు'- ఐఎండీ హెచ్చరిక
High temperature in Some Districts: రాయలసీమ జిల్లాల్లో వేడి, తేమ, అసౌకర్య వాతావరణం ఏర్పడ వచ్చని అమరావతి వాతావరణ కేంద్రం (Amaravati Weather Center) పేర్కొంది. రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాలలో 42.0, కర్నూలు 41.9, కడప 41.2, అనంతపురం 40.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్సాఆర్ జిల్లాలో 13, నంద్యాల జిల్లాలో 9, కర్నూలు 2, పార్వతీపురం మన్యం 2, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అనంతపురం జిల్లాల్లోని ఒక్కో మండలంలో వడగాలులు వీయడంతో ప్రజలు ప్రయాణాలు కొనసాగించలేక ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం వైఎస్సాఆర్ జిల్లాలోని 18 మండలాలతో పాటు నంద్యాల, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.