Summer Camps in Hyderabad 2024 : సమ్మర్ హాలిడేస్.. పిల్లలు ఎంజాయ్ చేయడానికి మంచి అవకాశం. అయితే.. నిజానికి పుస్తకాలు పక్కన విసిరికొట్టి గ్రౌండ్లో దుమ్ము లేపాల్సి ఉంటుంది. కానీ.. విజృంభిస్తున్న ఎండలతో ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది. ఇక, పిల్లలు ఇంట్లో ఉన్నారంటే అరాచకం సృష్టిస్తారు. అంతేనా..? రోజంతా మొబైల్ ఫోన్లో మునిగిపోతారు. లేదంటే.. టీవీకి అతుక్కుపోతారు. దీర్ఘకాలంలో ఇది వారి మానసిక ఆరోగ్యానికి, కంటి చూపునకూ మంచిది కాదు. అందుకే.. పేరెంట్స్ సమ్మర్ క్యాంప్స్ వైపు చూస్తుంటారు.
పిల్లలు ఇలా సమ్మర్లో ఏదైనా క్యాంప్‌లో చేరితే.. ఆటలు, పాటలు, యోగా, ధ్యానం వంటివి నేర్చుకుంటారు. వీటివల్లవారు శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారని నిపుణులు సూచిస్తున్నారు. మరి, మీరు కూడా మీ పిల్లలను ఏదైనా సమ్మర్లో క్యాంప్‌కు పంపించాలనుకుంటున్నారా? అయితే.. హైదరాబాద్ నగరంలో కొన్ని సంస్థలు పిల్లలకు వేసవి శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రామకృష్ణ మఠం :
యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పిల్లలు పెంపొందించుకునే విధంగా రామకృష్ణ మఠం ఈ సమ్మర్లో క్యాంప్ నిర్వహిస్తోంది. ఇందులో పిల్లలకు స్వామిజీలతో శిక్షణ ఇవ్వనున్నారు. రామకృష్ణ మఠం "వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్" (వీఐహెచ్ఈ ) సంస్కార్ - 2024 పేరుతో 4వ తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు వేసవి శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తుంది. 4-7 తరగతి చదివే విద్యార్థులకు జరిగే శిక్షణా శిబిరం ఏప్రిల్ 29న ప్రారంభమై మే 10న ముగుస్తుంది. పిల్లలకు 12 రోజుల పాటు ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు క్లాసులు జరగనున్నాయి.