Blind Teachers Success Stories in Telangana : ప్రపంచంలో మనిషికి అన్నింటికంటే అతి ముఖ్యమైనవి కళ్లే. అవే లేకుంటే ఆస్తి, అంతస్తులు ఎన్ని ఉన్నా వ్యర్థమే అనే భావన అందరిలోనూ ఉంటుంది. ఆ ఆలోచనను పటాపంచలు చేసి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. కామారెడ్డి జిల్లా బారండ్‌ఎడ్గికు చెందిన ఉపాధ్యాయుడు సంతోశ్, సూర్యాపేట జిల్లా బండరామారం ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు బాణాల ఉమారాణి. పుట్టుకతోనే రెండు కళ్లు లేకపోయినా అంధత్వాన్ని జీవితానికి భారంగా ఏనాడు భావించలేదు.
ధైర్యంగా విధిరాతను ఎదుర్కొని చివరికి ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారి ప్రగతికి బాటలు వేస్తున్నారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం అహర్నిశలు కృషి చేసిన సంతోశ్ 2017లో డీఎస్సీ పరీక్ష రాసి 2020లో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. మొదటగా లింగంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేసి, ఆ తర్వాత బీర్కూర్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లాడు.
అందరికీ ఆదర్శంగా అంధ ఉపాధ్యాయుల బోధన :ఇటీవల చేసిన బదిలీల్లో మళ్లీ లింగంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలకే వచ్చి ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నాడు. ఉపాధ్యాయుడిగా ఎంపికైన మొదట్లో చదువు ఎలా చెబుతారని అందరూ అనుమానపడ్డారు. కొన్ని రోజులకు బోధించే విధానాన్ని చూసి ముక్కున వేలేసుకున్నారు. బోధించే పాఠాన్ని ముందు రోజే యూట్యూబ్‌లో విని, పాఠశాలకు వచ్చాక విద్యార్థులతో చదివిస్తున్నారు. ఆ తర్వాత పూర్తిగా దానికి సంబంధించిన సారాంశాన్ని విద్యార్థులకు వివరిస్తున్నారు.