తెలంగాణ

telangana

ETV Bharat / state

సబ్​రిజిస్ట్రార్​, బీఆర్​ఎస్ లీడర్ కలిశారు - రూ.కోటి విలువైన భూమిని మింగేశారు - SUB REGISTRAR JYOTHI ARREST

స్థలం యజమాని మరణించినట్లుగా ఫేక్​ డాక్యుమెంట్లు సృష్టించిన నిందితులు - సబ్​రిజిస్ట్రార్​ సాయంతో రిజిస్ట్రేషన్​ - సబ్​రిజిస్ట్రార్​ అరెస్టు

Sub Registrar Jyothi Arrest
Sub Registrar Jyothi Arrest (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 29, 2024, 7:17 PM IST

Sub Registrar Jyothi Arrest : ఓ ఖాళీ స్థలంపై కన్నేసిన కొందరు ఏకంగా ఆ స్థలం యజమాని మరణించినట్లుగా ఫేక్​ సర్టిఫికెట్​ను సృష్టించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ సాయంతో రిజిస్ట్రేషన్​ను పూర్తి చేశారు. ఇందులో కీలక సూత్రధారిగా ఉన్న బీఆర్ఎస్​ మహిళా నేత, మరో ఐదుగురిని ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు సబ్‌రిజిస్ట్రార్‌ జ్యోతిని మంగళవారం అరెస్టు చేసి మేడ్చల్‌ న్యాయస్థానంలో(కోర్టు) హాజరుపర్చారు. కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్​ను విధించింది.

ఇదీ జరిగింది :ఉప్పుగూడ హనుమాన్‌ నగర్​కు చెందిన లెండ్యాల సురేశ్​కు సుభాష్‌నగర్‌ - వెంకట్రాద్రినగర్‌లో 200 గజాల స్థలం ఉంది. ఆ స్థలం ఖాళీగా ఉన్నట్లు సుభాష్‌ నగర్‌కు చెందిన బీఆర్ఎస్​ మహిళా నేత పద్మజ రెడ్డి, అలియాస్‌ కుత్బుల్లాపూర్‌ పద్మక్క(32) గుర్తించింది. హయత్‌నగర్​నకు చెందిన రేపాక కరుణాకర్‌ (34)ను సంప్రదించింది. రూ.3.50 లక్షలు చెల్లించి ఫేక్​ పత్రాల తయారీకి ఒప్పందం చేసుకుంది. ఇంటి ఓనర్​ 1992లోనే మృతిచెందినట్లుగా డెత్​ సర్టిఫికెట్​ను సృష్టించారు. ఈ తంతులో రవిశంకర్‌ అనే వ్యక్తిని అతడి కుమారుడిగా సృష్టించారు.

స్థలం యజమాని ఫిర్యాదుతో కబ్జా బాగోతం వెలుగులోకి :ఆధార్‌ కేంద్రం ఆపరేటర్‌ గగనం నరేంద్ర(25) సహకారంతో హరీశ్‌ అనే వ్యక్తిని రవిశంకర్‌గా చూపించేందుకు ఫేక్​ పాన్‌కార్డును తయారు చేయించారు. దాంతో ఆధార్‌లోను పేరు మార్పులు చేశారు. 2023 ఫిబ్రవరిలో కుత్బుల్లాపూర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్​ అప్పటి అధికారిణి జ్యోతి సాయంతో పద్మజ రెడ్డి సోదరి నాగిరెడ్డి కోమల కుమారికి ఈ స్థలాన్ని రవిశంకర్‌ విక్రయించినట్లు రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయించారు. స్థలం యజమాని లెండ్యాల సురేశ్‌ ఫిర్యాదు చేయడంతో స్థలం కబ్జా బాగోతం బయటికొచ్చింది. నిందితుల వద్ద పోలీసులు నకిలీ పత్రాలు, ల్యాప్‌టాప్‌లను, స్కానర్‌ తదితర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ సబ్‌రిజిస్ట్రార్‌ జ్యోతిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు 14 రోజుల రిమాండ్ కోసం చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

అక్రమంగా రిజిస్ట్రేషన్లు.. ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్

Suspension: మంచిర్యాల సబ్​రిజిస్ట్రార్​ సస్పెన్షన్​

ABOUT THE AUTHOR

...view details