An Orphan Boy is a Suspicious Death : ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివే ఓ అనాథ బాలుడు అనుమానాస్పద స్థితిలో బావిలో చనిపోయి కనిపించినా, ఆ గ్రామస్థులు మానవత్వం చూపలేదు. పోలీసులకూ విషయం తెలిసినా పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లులో గత నెల 24న చోటు చేసుకున్న విషాదకరమైన ఘటన వివరాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. బాలుడు షేక్ సమీర్ స్వగ్రామం గుంటూరు జిల్లాలోని అమరావతి మండలం కర్లపూడి అనే గ్రామం. చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు చనిపోయారు.
దీంతో పొన్నేకల్లులోని నాయనమ్మ మస్తాన్‌బీ వద్ద ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న జడ్పీ (జిల్లా పరిషత్) ఉన్నత పాఠశాలలో 9వ తరగతి (బి సెక్షన్) చదువుతున్నాడు. ఆ తరగతికే చెందిన కొంత మంది ఏ సెక్షన్ విద్యార్థులు కొద్ది రోజులుగా షేక్ సమీర్‌తో గొడవపడి కొట్టి భయపెట్టే సరికి, గత నెల (అక్టోబర్) 24న పాఠశాలకు వెళ్లలేదు. ఆ రోజు మధ్యాహ్నం పాఠశాలలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆ సమయంలో కొందరు తొమ్మిదో తరగతి పిల్లలు డ్రిల్‌కు హాజరవకుండా వెళ్లిపోయారు.
ఈత పేరు చెప్పి : ఆ రోజు ఇంటివద్ద ఉన్న సమీర్‌ను తీసుకొని ఈత కొడదామని గ్రామ పొలిమేరలోని బావి వద్దకు తీసుకెళ్లి అతనిపై దాడి చేసి అందులో పడేశారని సమాచారం తెలిసింది. వెంటనే గ్రామస్థులు విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. వారు అక్కడికి చేరుకుని బావిలో ఉన్న బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. బాలుడి శరీరంపై తీవ్ర గాయాలు, చొక్కాపై రక్తపు మరకలు ఉండటాన్ని గమనించారు. ఆ ఊరి గ్రామస్థులు పోలీసుల్ని మేనేజ్ చేసి పోస్టుమార్టం లేకుండా మృతదేహాన్ని ఆ రాత్రి కర్లపూడి తరలించారు. అక్కడ బాలుడి మృతదేహంపై గాయాలను చూసిన బంధువులు ఘటనను ఆ గ్రామ సర్పంచ్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులతో మాట్లాడారు. బాలుడే ఆధారమైన మస్తాన్‌బీకి ఆర్థిక సాయం చేసి ఆమెను ఆదుకోవాలని కోరారు.