ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుడ్లవల్లేరు రహస్య కెమెరాల ఘటన - దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశం - Hidden Cameras in Girls Hostel - HIDDEN CAMERAS IN GIRLS HOSTEL

Hidden Cameras in Engineering College Girls Hostel: గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కళాశాల వసతి గృహం వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరాలున్నట్లు జరిగిన ప్రచారం తీవ్ర కలకలం రేపింది. కొన్ని రోజులుగా దృశ్యాలను చిత్రీకరించారంటూ విద్యార్థినులు మూకుమ్మడిగా నిరసనకు దిగారు. బీటెక్‌ చివరి సంవత్సరం విద్యార్థితో పాటు మరో విద్యార్థిని ఈ వ్యవహారంలో ఉన్నారని వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్‌ చేశారు. ఘటనపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. హాస్టల్‌లో కెమెరాలు గుర్తించలేదని పోలీసులు తెలిపారు. దీంతో ఈ వ్యవహారం ఎట్టకేలకు సద్దుమణిగింది. విద్యార్థినులు హాస్టల్‌లో ఉండేందుకు ఒప్పుకున్నారు.

Hidden Cameras in Engineering College
Hidden Cameras in Engineering College (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2024, 10:19 AM IST

Updated : Aug 30, 2024, 10:37 PM IST

Hidden Cameras in Gudlavalleru Engineering College :కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కళాశాలలో రహస్య కెమెరాల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వసతి గృహం బాత్‌రూమ్‌లలో రహస్య కెమెరాలు పెట్టారని విద్యార్థినులు గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఆందోళన చేపట్టారు. కెమెరాలతో చిత్రీకరించిన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుక బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి, అతని సహచరులు, మరో విద్యార్థిని ఉన్నారని ఆరోపించారు.

దీంతో జూనియర్‌, సీనియర్‌ విద్యార్థుల మధ్య వాగ్వాదాలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు కళాశాల హాస్టల్‌కు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సెల్‌ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌ స్వాధీనం చేసుకున్నారు. రహస్య కెమెరాలు ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో కొన్ని రోజుల క్రితమే ప్రచారం జరిగినా బాధ్యులపై యాజమాన్యం చర్యలు తీసుకోలేదని విద్యార్థినులు పోలీసులకు తెలిపారు.

ఐదుగురు అల్లిన 'ప్రేమ'కథా చిత్రమ్ - 'హిడెన్ కెమెరాల' వ్యవహారంలో క్రేజీ ట్విస్ట్ - నిజం తేల్చిన పోలీసులు - HIDEN CEMERA STORY

చంద్రబాబు ఆదేశాలు :ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే కాలేజీకి వెళ్లాలని మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్‌ బాలాజీ, ఎస్పీ గంగాధర్‌కు సూచించారు. సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. మన ఇంట్లో ఆడబిడ్డలకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో అంతే సీరియస్‌గా స్పందించి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. ఎవరి వద్దనైనా ఆధారాలు ఉంటే నేరుగా తనకే పంపాలని విద్యార్థినులను ఆయన కోరారు. ఘటనపై ఎవరూ అధైర్యపడొద్దని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తప్పు చేసిన వారిని ప్రభుత్వం వదిలిపెట్టదని విద్యార్థుల తల్లిందండ్రులకు భరోసా ఇచ్చారు.

విద్యార్థుల ఫిర్యాదును యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణపైనా విచారణ జరపాలన్నారు. యాజమాన్యం, అధికారుల అలసత్వం ఉన్నట్లు రుజువైతే చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. ప్రతి మూడు గంటలకొకసారి తనకు ఘటనపై రిపోర్టు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఘటనపై ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఎలాంటి కెమెరాలు లేవు : సీఎం ఆదేశాలతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. ప్రాథమిక పరిశీలన మేరకు బాలికల హాస్టల్‌లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని, నిందితుల ల్యాప్‌ట్యాప్‌లు, మొబైల్‌ ఫోన్లు పరిశీలించినా, నేరారోపణ చేసే ఏ విధమైన అంశాలు లేవని ఎస్పీ గంగాధర్‌ ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా నేరం చేసినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు గుడివాడ సీసీఎస్ సీఐ రమణమ్మ నేతృత్వంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌, ఎస్పీ తెలిపారు. ఆధారాలు, సమాచారాన్ని అందజేసి దర్యాప్తునకు సహకరించాలని విద్యార్థినులను కోరారు.

కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం : మంత్రి కొల్లు రవీంద్ర కాలేజీకి వచ్చి విద్యార్థినులతో మాట్లాడారు. కళాశాల యాజమాన్యంపై తమకు నమ్మకం లేదని, మూడు రోజుల క్రితమే ఘటన గురించి తెలిసినా, బయటకు రానీయలేదని మంత్రికి విద్యార్థులు తెలిపారు. న్యాయం జరిగేవరకు కళాశాలకు వెళ్లేదిలేదని నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. విద్యార్థినులకు పూర్తి సంరక్షణ కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వసతిగృహం వార్డెన్‌ని సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సోమవారం వరకు సెలవులు :గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కళాశాల రహస్య కెమెరాల వ్యవహారం ఎట్టకేలకు సద్దుమణిగింది. సీఎం ఆదేశాలతో విచారణ వేగవంతం చేసిన పోలీసులు విద్యార్థినుల సమక్షంలోనే హాస్టల్‌ మొత్తం తనిఖీ చేశారు. ఎలాక్ట్రానిక్‌ డివైస్‌ని గుర్తించే పరికరాలతో హాస్టల్‌ మొత్తం సోదాలు చేశారు. తనిఖీల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన విద్యార్థినులు హాస్టల్‌లో ఉండేందుకు ఒప్పుకున్నారు. సోమవారం వరకు సెలవులు ప్రకటించిన యాజమాన్యం మళ్లీ తనిఖీలు చేస్తామని తెలిపింది. విద్యార్థినులపై కక్ష సాధింపు చర్యలు ఉండకూడదని, యాజమాన్యానికి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఎవరైనా వేధిస్తే తమకు ఫిర్యాదు చేయాలని విద్యార్థినులకు సూచించారు. మరోవైపు ఘటనతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు విద్యార్థినులను హాస్టల్‌ నుంచి ఇళ్లకు తీసుకెళ్లారు.

కొనసాగుతున్న విచారణ : బాలికల వసతిగృహం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ గంగాధర్‌ తెలిపారు. హాస్టల్‌ ప్రతి అంతస్తుకూ ఇన్‌ఛార్జిలుగా మహిళా కానిస్టేబుళ్ల ఉంచామని తెలిపారు. విచారణ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతోందని కలెక్టర్‌ బాలాజీ వెల్లడించారు.

రూమ్​లో ఉన్న స్పై కెమెరాలను గుర్తించాలా? ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి!​

Last Updated : Aug 30, 2024, 10:37 PM IST

ABOUT THE AUTHOR

...view details