Garividi Veterinary College issue in Vizianagaram: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఉత్తరాంధ్రలో పశువైద్య విద్యకు కేంద్ర బిందువైన విజయనగరం జిల్లాలోని గరివిడి పశువైద్య కళాశాల విద్యార్ధుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్రారంభమై సుమారు నాలుగేళ్లు గడుస్తున్నా నిధుల లేమితో కళాశాల భవనాలు పూర్తి కాలేదు. అంతేకాదు, పూర్తిస్థాయి బోధన సిబ్బంది నియామకం సైతం జరగలేదు. అంతేకాకుండా కళాశాల ప్రయోగశాలకు పరికరాల కొనుగోళ్ల నిధుల కోసం అధికారులు అప్పట్లో చేసిన ప్రతిపాదనలూ అటకెక్కాయి. దీంతో కళాశాల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది.
ఇప్పటి వరకు మూడు, నాలుగేళ్ల పశు వైద్యవిద్య బోధనకు భారత పశువైద్య విద్యామండలి(వీసీఐ) నుంచి అనుమతులు లభించలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నాటికి కోర్సు పూర్తి చేయనున్న విద్యార్ధులు ఆందోళన బాట పట్టారు. ఉత్తరాంధ్రకు పశువైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న సదుద్దేశంతో 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నాబార్డు నిధులు 82 కోట్లుతో గరివిడిలో పశువైద్య కళాశాలను మంజూరు చేసింది. అన్ని అనుమతులతో పాటు కళాశాలకు అన్ని రకాల అనుమతులతో పాటు కళాశాల ప్రధాన భవనం, వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్, విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా రెండు వసతి గృహ భవనాల నిర్మాణ పనులు అప్పట్లోనే చేపట్టారు.
నిధులను దారి మళ్లించిన గత ప్రభుత్వం: 2019లో అధికారంలోకి వచిన వైఎస్సార్సీపీ కళాశాలకు ఎలాంటి సౌకర్యాలను కల్పించకుండానే 2021లో హడావుడిగా దీనిని ప్రారంభించింది. తరువాత కూడా దీని నిర్వహణను ఏ మాత్రం పట్టించుకోకుండా గాలికొదిలేసింది. 2016లో కళాశాలను మంజూరు చేసినపుడే నాటి టీడీపీ ప్రభుత్వం 84 మంది శాశ్వత అధ్యాపకులను నియమించేందుకు జీవో జారీ చేసింది. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ మాత్రం ఒక్క శాశ్వత అధ్యాపకుడిని కూడా నియమించలేదు. భవన నిర్మాణాలకు కేటాయించిన 82 కోట్లు నిధుల్లో నాబార్డు నుంచి 82 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 18 శాతం చొప్పున నిధులు సమకూర్చాల్సి ఉండగా గత ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా నాబార్డు నిధులను సైతం ఇతర అవసరాలకు దారి మళ్లించింది. కళాశాల ప్రధాన భవనాన్ని నిర్మించిన గుత్తేదారుకు దాదాపు 14 కోట్లు వరకు బిల్లులు చెల్లించలేదు
పశు చికిత్సా భవనంలోనే బోధన:విద్యార్థుల బోధనకు ఉపయోగించే ప్రధాన భవన నిర్మాణం పూర్తి కాలేదు. పశువుల చికిత్స కోసం నిర్మించిన క్లినికల్ కాంపెక్స్ భవనంలోనే బోధన సాగించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం 327 మంది విద్యార్థులు ఈ కళాశాలలో చదువుతున్నారు. జాతీయ పశువైద్య మండలి నిబంధనలకు అనుగుణంగా కళాశాలలో బోధనా సిబ్బంది, సౌకర్యాలను ఇప్పటికీ వర్సిటీ అధికారులు కల్పించలేకపోయారు. ఫలితంగా కళాశాలలో 2023-2024 సంవత్సరాల్లో బోధనకు వీసీఐ అనుమతులు నిరాకరించినప్పటికీ బోధన కొనసాగిస్తూ వస్తున్నారు. మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ఈ ఏడాది మార్చితో వెటర్నరీ సైన్స్ కోర్సు పూర్తి కానుంది. ఈలోగా వీసీఐ గుర్తింపు రాకపోతే తమ భవిష్యత్తు ఏమిటన్న ఆందోళన వారిలో నెలకొంది.
విద్యార్థుల ఆందోళన: చదువు పూర్తయ్యాక ఇంటర్న్షిప్ చేయాలన్నా, పీజీ చేయాలన్నా, ఏదైనా కొలువులో చేరాలన్నా, వీసీఐ గుర్తింపుతో కూడిన సర్టిఫికెట్ తప్పనిసరి. కానీ కోర్సు చివరి దశకు వచ్చినా కళాశాలకు వీసీఐ గుర్తింపు లభించకపోవటంతో మా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుందని మంగళవారం విద్యార్థులంతా తరగతులను బహిష్కరించి కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. కళాశాలలో అధ్యాపకులు, సౌకర్యాల కొరతను తీర్చి వీసీఐ గుర్తింపు తీసుకురావాలని వారంతా డిమాండ్ చేశారు