Streams Flowing With Heavy Rains in Andhra Pradesh:రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొన్ని చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అల్లూరి జిల్లా పాడేరులో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాలకు కొండల మధ్య నుంచి భారీగా వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో గిరిజనులు రహదారిపై వెళ్లేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షం, రెండు ఇళ్లు నేలమట్టం - తప్పిన ప్రాణాపాయం - Two Houses Collapsed
ఒడిశా సరిహద్దు ప్రాంతం పెదబయలు మండలం గిన్నెలకోటలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇచ్చిన నిధులతో వంతెన పూర్తి చేయలేదు. గ్రామానికి వెళ్లేందుకు కొండల మధ్య ప్రయాణం అంటే సాహసమనే చెప్పాలి. గిరిజనులు ఒకరు చేయిని మరొకరు పట్టుకుని ఉద్ధృతమైన నీటి ప్రవాహం మధ్య గ్రామానికి వెళుతున్నారు. నిత్యం ఇదే విధంగా సమస్యల సుడిగుండంలో వెళ్లాల్సి వస్తుందని గిరిజనులు వాపోతున్నారు.
అల్లూరి జిల్లా రంపచోడవరంలో మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో కొండ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షం అధికంగా కురవడంతో భూపతిపాలెం, ముసురుమిల్లి, మద్దిగడ్డ, సూరంపాలెం జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. వర్షపు నీరు రహదారులపై చేరి పలుచోట్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిస్తే జలాశయాల్లో నీటిని విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. ఐటీడీఏ అధికారులు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.