TTD Additional EO pressmeet on Boy Death at Tirumala Annadana Satram : తిరుమలలో ఈనెల 22న మంజునాథ అనే బాలుడు అన్నప్రసాద కేంద్రంలో కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆ బాలుడు చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. చిన్నారి మృతి పై టీటీడీ అదనపు ఈవో స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ బాలుడు మంజునాథ్ మృతి దురదృష్టకరమని అన్నారు. బాలుడి మృతికి సంబంధించి సీసీ కెమెరాలు పరిశీలించామని తెలిపారు. ర్యాంప్‌పై పరిగెత్తుతూ బాలుడు కిందపడ్డాడని అతడికి ఇదివరకే గుండె సంబంధిత చికిత్స జరిగిందిని వివరించారు.
బాలుడు కిందపడిపోగానే విజిలెన్స్ సిబ్బంది వెంటనే స్పందించి అతడికి సీపీఆర్ చేశారని తెలిపారు. తోపులాట వల్లే బాలుడు చనిపోయారన్నది అవాస్తవమని స్పష్టం చేశారు. వాస్తవాలు ఇలా ఉండగా కొన్ని ప్రసార మాధ్యమాలలో ఆ బాలుడు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో తోపులాట కారణంగా మరణించాడని పేర్కొనడం వాస్తవం కాదని టీటీడీ (TTD) వివరించింది. తిరుమల దేవస్థానంపై ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచురించి, అవాస్తవాలు ప్రచారం చేసి, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చెయ్యడం విచారకరమన్నారు. అటువంటి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ సభ్యులు హెచ్చరించారు. ఇకపై టీటీడీపై అవాస్తవాలు ప్రచారం చేయడం ఆపాలని కోరారు.
అసలేం జరిగిందంటే : ఈనెల 22న కర్ణాటక రాష్ట్రం మడికెరకు చెందిన మంజునాథ అనే బాలుడు తిరుమల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో సాయంత్రం భోజనం తర్వాత బయటకు వస్తూ అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెనువెంటనే అక్కడ ఉన్న సిబ్బంది స్పందించి ఆ బాలున్ని తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో చేర్పించారు. తదనంతరం వైద్యుల సలహా మేరకు తిరుపతిలోని స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆ బాలున్ని చేర్పించారు. అయితే దురదృష్టవశాత్తు ఆ బాలుడు ఈ రోజు మృతి చెందాడు. వాస్తవానికి ఆ బాలుడు దీర్ఘకాలంగా గుండె జబ్బుతో బాధపడుతూ ఆరు సంవత్సరాల మునుపే గుండెకు చికిత్స తీసుకున్నట్లు వైద్యులు తెలిపారు.