Road Accidents In Hyderabad : హైదరాబాద్‌లో రోడ్లు ప్రమాదాల కారణంగా రక్తమోడుతున్నాయి. ఇటీవల మేడ్చల్ జిల్లా జీడిమెట్ల సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. తాజాగా హబ్సిగూడలో ఆగివున్న ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో పదో తరగతి విద్యార్థిని మృతి చెందడం నగరాన్ని ఉలికిపాటుకు గురి చేసింది. ఈ ప్రమాదాలకు వాహనాల అతివేగమే కారణమని పోలీసులు నిర్థారించారు. పోలీసులు నిర్వహించిన తనిఖీలలో పాఠశాల విద్యార్థులను తీసుకెళ్లే ఆటోలు, బస్సు డ్రైవర్లలో కొందరికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని గుర్తించగా మరికొందరు ఉదయాన్నే మద్యం తాగి బస్సు నడిపినట్లు తేల్చారు.
పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో 3 గంటల్లో 350 మందికి పైగా అపసవ్యదశలో రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు పట్టుబడ్డారు. నగరవ్యాప్తంగా సుమారు 60 ప్రాంతాల్లో వాహనదారులు అపసవ్యదిశలో ప్రయాణం సాగిస్తున్నట్లు పోలీసులు నివేదిక రూపొందించారు. అయితే నగరంలో ఈ ఏడాది 7 నెలల వ్యవధిలో సుమారు 200కు పైగా రహదారి ప్రమాదాలు జరిగాయి. వీటిలో సుమారు 25 మంది వరకు మరణించినట్లు తెలుస్తోంది.
తరచూ జఠిలమవుతున్న ట్రాఫిక్ సమస్య :జనాభాతో పోటీపడుతూ పెరుగుతున్న వాహనాలతో తరచూ ట్రాఫిక్ సమస్య జఠిలమవుతోంది. మారిన అవసరాలకు అనుగుణంగా ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్న 18 ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లను 31కి పెంచారు. రెండు జోన్లను మూడు జోన్లు చేశారు. ముగ్గురు ట్రాఫిక్ డీసీపీలు, 11 మంది ఏసీపీలు, 1800 మందికి పైగా సిబ్బందిని కేటాయించారు.
ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించాలనే లక్ష్యంతో ఠాణాలు పెంచినా పరిస్థితి ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా మారింది. ప్రముఖుల పర్యటనల సమయంలో మాత్రమే అధికశాతం ట్రాఫిక్ పోలీసు అధికారులు రోడ్లపై కనిపిస్తున్నారనే విమర్శలున్నాయి. నగర సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పలుమార్లు విజిబుల్ పోలీసింగ్ అమలు చేయమని ఆదేశాలిచ్చినా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవట్లేదంటూ ట్రాఫిక్ పోలీస్ అధికారొకరు ఆవేదన వ్యక్తం చేశారు.