Story on Biological Clock in Human Body :టిక్ టిక్ టిక్‌లు వినిపించవు. పెద్ద ముల్లూ, చిన్న ముల్లూ కనిపించవు. అయినా సరే, మన శరీరంలో ఓ గడియారం నిత్యం పనిచేస్తూనే ఉంటుంది. అదే మన ఆకలి నిద్రల్ని నిర్ణయిస్తుంది. ఆరోగ్య అనారోగ్యాల్ని నిర్దేశిస్తుంది. ఆ ‘జీవ గడియారం’తో మన చేతి గడియారాన్ని అనుసంధానించుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు.
మనిషి ప్రకృతిలో పుట్టాడు. ప్రకృతి భిక్షతోనే పెరిగాడు. ఎంత శక్తిమంతుడైనా, ఎన్ని ఆవిష్కరణలు చేసినా ప్రకృతి నియమాల ప్రకారం తూచాతప్పకుండా పాటించాల్సిందే. తేడావస్తే ప్రకృతి తాట తీస్తుంది. తన షరతులను ఉల్లంఘించకుండా మనిషి లోలోపల ఓ జీవ గడియారాన్ని ఏర్పాటు చేసింది కూడా. అది నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఆ ముళ్లు ఒక్కో సమయానికి శరీర వ్యవస్థలోని ఒక్కో విభాగం మీదుగా ప్రయాణిస్తాయి. ఫలితంగా, కొన్ని వేళల్లో కొన్ని భాగాలు చురుగ్గా మారిపోతాయి. కొన్ని గ్రంథుల ఊట పెరిగిపోతుంది. కొన్ని రసాయనాల ప్రవాహం ఉద్ధృతం అవుతుంది.
బాహుబలి గడియారం :మెదడులోని సుప్రాచియాస్మాటిక్ న్యూక్లియస్ (ఎస్సీఎన్) అనే కణ సముదాయాన్ని ‘బాహుబలి గడియారం’గా చెబుతారు. ఇది ప్రకృతికీ, శరీరానికీ మధ్య రాయబారిగా పనిచేస్తుంది. సూర్యోదయ, సూర్యాస్తమయాల సమాచారాన్ని మెదడుకు అందిస్తుంది. ఆయా వేళల్ని అనుసరించి శరీర ఉష్ణోగ్రత ఎంత ఉండాలన్నది నిర్ణయిస్తుంది. హార్మోన్ల స్రావాన్ని నిర్దేశిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇక్కడి నుంచే సకల వ్యవస్థలకూ సందేశాలు వెళ్తాయి. అదనంగా స్కిన్ లివర్, ఇమ్యూన్, కిడ్నీ, లంగ్స్ ఇలా అనేకానేక ఉప గడియారాలూ పనిచేస్తుంటాయి. పునరుత్పత్తి వ్యవస్థకు కూడా ఓ గడియారం ఉంది. మహిళల్లో ప్రత్యేకించి కొన్ని రోజుల్లో మాత్రమే గర్భధారణ సామర్థ్యం అధికంగా ఉండటమే దీనికి ఉదాహరణ.
దాన్ని బట్టే చికిత్సలు : మన శరీరంలోని దాదాపు యాభైశాతం జన్యువులు జీవ గడియారం నియంత్రణలో పని చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉదయం పూట మన జీవక్రియలు చురుగ్గా సాగుతుంటాయి. ఆ కారణంగానే థైరాయిడ్, అధిక రక్తపోటు, గుండె జబ్బులతో ముడిపడిన ఔషధాల్ని పొద్దున్నే తీసుకోవాలని చెబుతారు. ఏ సమయంలో ఏ ఔషధాలు రోగిపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే కోణంలోనూ అంతర్జాతీయంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రయోగాత్మకంగా క్యాన్సర్ రోగులకు వారి జీవ గడియారాల్ని బట్టి కీమోథెరపీ వేళల్ని నిర్ణయిస్తున్నారు. ఆ ప్రయత్నాలు కూడా సత్ఫలితాలను ఇస్తున్నాయి.
ఉదయం సాయంత్రాలను గుర్తించి : జీవ గడియారానికి సూర్యకాంతే శక్తి కేంద్రం. చెట్టు మీది ఆకులు పత్రహరితాన్ని తయారు చేసుకోవడంలో సూర్యకిరణాలను ఉపయోగించుకుంటాయని చిన్నప్పుడే చదువుకున్నాం. మనిషి మనుగడకూ కాంతి చాలా అవసరమే. ప్రకృతిలోని చీకటివెలుగుల ఆధారంగానే జీవ గడియారపు ముళ్లు కదుల్తాయి. ప్రత్యేకించి, వేకువజాము కిరణాలతో జీవ గడియారం రీచార్జ్ అవుతుంది. ఆ వెచ్చని కాంతి మనిషి కనురెప్పల మీద పడగానే నిద్ర తన ‘షిఫ్ట్’ ముగించుకుని వెళ్లిపోతుంది అని అర్థం. ‘మెలకువ’ డ్యూటీకి ఎక్కుతుంది. ఆధునిక జీవితాల్లోని సెల్ఫోన్లూ, ల్యాప్‌టాప్‌లూ మొదలైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు లయను తప్పిస్తున్నాయి. వాటి తెరల నుంచి వెలువడే కృత్రిమ నీల వర్ణాలు నిద్రా దేవత ప్రతినిధి అయిన మెలటోనిన్ హార్మోన్ విడుదలను అడ్డుకుంటున్నాయి. అందుకే, వాటి ముందు కూర్చుంటే నిద్ర పట్టదు. సహజమైన వెలుతురు మనిషికి ఉద్వేగ పరమైన ఆరోగ్యాన్నీ ఇస్తుంది. డిప్రెషన్‌ను దూరం చేస్తుంది. చురుకుదనాన్ని ప్రసాదిస్తుంది.
కృత్రిమ కాంతుల మధ్య గడపొద్దు : సహజకాంతికి దగ్గరగా కూర్చునేవారు, మిగిలిన ఉద్యోగులతో పోలిస్తే ఎంతోకొంత సమర్థంగా పనిచేస్తారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి, ఆఫీసులో వీలైనంత వరకూ కిటికీ పక్క సీటులో కూర్చోవడానికి ప్రాధాన్యం ఇవ్వండి. పొద్దున్నే కాసేపు ఆరుబయటికి వెళ్లాలి. కిరణస్నానం చేయాలి. దురదృష్టవశాత్తూ ట్యూబ్‌లైట్ వెలుగులూ, నియాన్ ఇలా కృత్రిమ కాంతుల మధ్యనే రోజంతా గడిచిపోతోంది. విద్యుత్ బల్బును ఆవిష్కరించడం ద్వారా థామస్ అల్వా ఎడిసన్ మానవాళికి ఉపకారం చేసిన మాట వాస్తవమే అయినా కృత్రిమ కాంతులు వచ్చాక మనిషి చీకటిని పట్టించుకోవడలేదు. వృత్తి ఉద్యోగాలు రాత్రి వేళల్లో చేసుకుంటున్నారు. దీంతో వెలుతురుకు విలువ లేకుండా పోయింది.
నిద్ర కీలకం : మనిషి జీవనశైలిలో నిద్ర కీలకమైంది. సూర్యాస్తమయం కాగానే మనలోని జీవగడియారానికి ఆ సమాచారం అందుతుంది. మరుక్షణమే, నిద్రకు ఏర్పాట్లు చేసుకోమంటూ శరీరానికి సంకేతాలిస్తుంది. ఆ మేరకు ఒంట్లో అనేక రసాయన మార్పులు జరుగుతుంటాయి. చురుకుదనం మాయం అవుతుంది. మగతను ప్రసాదించే హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. కనురెప్పలు బరువెక్కుతాయి. శరీర ఉష్ణోగ్రత కొంతమేర తగ్గుతుంది. ఇవన్నీ మనిషికి లాలిపాడే ఏర్పాట్లే. జీవ గడియారం జారీచేసే ఆ ఆదేశాల్ని మనం గౌరవించాలి. బలవంతంగా నిద్రను చంపుకుని డ్యూటీ కోసమో, కాలక్షేపం కోసమో అర్ధరాత్రి వరకూ మేల్కొని ఉండటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అందులోనూ, వయోజనులకు ఎనిమిది గంటల గాఢ నిద్ర అవసరం. అది కూడా, రోజూ ఒకే సమయానికి పడుకోవాలి. ఒకే వేళకు లేవాలి.