Murder Cases Increasing In Hyderabad Outskirts : జన సంచారం ఉండదు, ప్రశ్నించే వారుండరు. కనుచూపు మేరల్లో ఎక్కడ చూసినా ఖాళీ రోడ్లు, చెట్లు. నిఘా అంతంతే. ఇదే అవకాశంగా తీసుకుని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నగర శివార్లలోని ఫాంహౌస్‌లు, నిర్మానుష్య ప్రాంతాల్లో తరచూ జరుగుతున్న హత్యలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొన్ని కేసుల్లో ఎవరు, ఎందుకు హత్య చేశారో కనుక్కోవడం పోలీసులకు కత్తిమీద సాములా మారుతోంది. ఆచూకీ చిక్కక కేసులు ఏళ్ల తరబడి అలానే ఉండిపోతున్నాయి. కొన్నిసార్లు మృతులెవరో గుర్తించని పరిస్థితి వస్తుంది.
గతేడాది వేర్వేరు సందర్భాల్లో కందుకూరు ఠాణా పరిధిలోని వ్యవసాయ క్షేత్రాల దగ్గర ఇద్దరు హత్యకు గురైనా ఇప్పటికీ నిందితులు ఎవరో తెలియలేదు. నగరంలోని బాగ్‌అంబర్‌పేట డీడీ కాలనీ, సాయిబాబానగర్‌లో నివాసం ఉంటున్న వృద్ధ దంపతులను సైతం తాజాగా హత్య చేయడం ఆందోళనకు గురి చేస్తోంది.
జనసంచారం, పెట్రోలింగ్ తక్కువ : శివార్లలో జరిగే హత్యలు, ఇతర నేరాలు ప్లాన్ ప్రకారమే జరుగుతున్నట్లు పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మొయినాబాద్, శంషాబాద్, శామీర్‌పేట, ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్ తదితర ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఫాంహౌసులు ఉన్నాయి. పోలీస్‌స్టేషన్ పరిధి చాలా దూరం ఉండడంతో పాటు నిర్మానుష్య, అటవీ ప్రాంతాల్లో ఉంటున్నాయి. జనసంచారం, పెట్రోలింగ్ తక్కువ ఉంటుంది. దీంతో దారుణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఓ ముఠా శంషాబాద్ సమీపంలో అక్రమంగా ఫాంహౌస్ కట్టి కుక్కలు పెంచుతోంది. భూదందాల్లో వారిని ఎదిరించిన వారిని కిడ్నాప్ చేసి ఫాంహౌస్‌లో బంధించి, చిత్రహింసలు పెడుతున్నట్లు గుర్తించిన రాజేంద్రనగర్ పోలీసులు రెవెన్యూ శాఖతో కలిసి కూల్చేశారు.
ఈ కేసులన్నీ మిస్టరీలే..
- ఆదిభట్ల ఠాణా పరిధి బ్రాహ్మణపల్లి ఓఆర్‌ఆర్ సమీపంలో జనవరి 16న గోనె సంచిలో మృతదేహాన్ని పోలీలుసు గుర్తించారు. నిందితులు ఎక్కడో చంపేసి ఔటర్ రింగురోడ్డు పక్కన పడేశారు. మృతుడు, హంతకుడిని ఇంతవరకూ గుర్తించలేదు. నిర్మానుష్య ప్రాంతం కావడంతో ఆధారాలు దొరకలేదు.
- 2023 మార్చిలో దాసర్లపల్లిలోని ఓ ఫాంహౌస్‌లో మహిళ(45)ను దారుణంగా హత్య చేశారు. ఇప్పటికీ నిందితుల జాడ దొరకలేదు. ఇది జరిగిన మూడు నెలలకే ఆగాపల్లిలో మామిడితోటకు కాపలాగా ఉండే దంపతుల దగ్గరికి బంధువు వచ్చి రాత్రి నిద్రించగా తెల్లవారేసరికి అతణ్ని దారుణంగా హత్య చేశారు.
- శంషాబాద్ మండలం తొండుపల్లి శివారులో 2019 మార్చిలో కాలిపోయిన గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యమైంది. ఓ కారు వచ్చి వెళ్లినట్లు పోలీసులు సీసీ కెమెరాల్లో గుర్తించారు. రాత్రి కావడంలో స్పష్టత లేకపోవడంతో ఆ కేసు అలానే ఉంది.
- నార్సింగి ఠాణా పరిధిలో 2019లో మహిళ మృతదేహం దొరికింది. గుర్తుపట్టకుండా ముఖాన్ని పెట్రోలుతో తగులబెట్టారు. ఇతర ప్రాంతంలో చంపేసి ఔటర్ రింగురోడ్డు పక్కన పడేశారు. ఈ ఘటన జరిగి 5సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ తేలలేదు.