Five Day Traditional Wedding : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా చెప్పుకొనే విధంగా జరిగింది తూర్పు గోదావరి జిల్లాలోని ఓ పెళ్లి. ఆకాశం దిగి వచ్చి మబ్బులే పందిరిగా మారాయా అనే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. సంప్రదాయాలు కళ్లకు కట్టేలా అన్నింటిని తీర్చిదిద్దారు. తిరునాళ్లను తలపించేలా పెళ్లికి చుట్టుపక్కల ప్రాంతాల జనం విచ్చేశారు. కనుమరుగవుతున్న సంస్కృతి సంప్రదాయలకు గుర్తు తెచ్చే ఈ వేడుక విశేషాలేంటో తెలుసుకుందాం.
వివాహం అనేది జీవితంలో ఓ మరపురాని ఘట్టం. మరి అంతటి ప్రాధాన్యమున్న ఈ ఘట్టం కోసం ఎవరికి తోచిన రీతిలో వారు స్తోమతకు తగ్గట్టుగా ఘనంగా పెళ్లి తంతు నిర్వహిస్తుంటారు. అయితే ప్రపంచీకరణ నేపథ్యంలో వివాహ వ్యవస్థలోనూ ఎన్నో మార్పు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు పెళ్లి అనేది రోజుల పాటు జరిగే కార్యక్రమం. స్నాతకం నుంచి మొదలుకొని ఊరేగింపు వరకు ఆడంబరంగా చేసుకునేవారు. కానీ కాలంతో పాటు ప్రజల అలవాట్లలోనూ మార్పులు వచ్చాయి. అయినా కొంతమంది మాత్రం అలనాటి సంప్రదాయాల్ని ఇప్పటికీ పాటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇక్కడ మనం తెలుసుకోబోయే స్టోరీ అలాంటిదే.
అలనాటి సంప్రదాయాలను గుర్తు చేస్తూ : తూర్పు గోదావరి జిల్లా పెరవళి మండల కేంద్రం మరపురాని విధంగా ఐదు రోజుల పెళ్లితో ఒక్కటైంది ఓ జంట. పురాతన సంప్రదాయం ఉట్టిపడేలా నిర్వహించిన ఈ కల్యాణవేడుక ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. వినూత్నంగా నిర్వహించిన ఈ వివాహ కార్యక్రమాన్ని చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు. బంధుమిత్రుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. పల్లకిలో పెళ్లి కుమార్తెను తీసుకెళ్లడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
సంప్రదాయ రీతిలో ఘనంగా వివాహ వేడుక : అప్పటి సంప్రదాయాన్ని గుర్తుచేస్తూ పెరవలి మండలం తీపర్రుకు చెందిన కోడూరి కామేశ్వరరావు తన కుమార్తె హిమకు పామర్రుకు చెందిన బాలుతో నిర్వహిస్తున్న కల్యాణ ఘట్టం అందరినీ ఆకట్టుకుంటోంది. అయిదు రోజుల పాటు ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మొదటిరోజులో భాగంగా స్నాతకం, వివాహం, ప్రధాన హోమాలు, రెండో రోజు ఉదయం, సాయంత్రం హోమాలు, మూడో రోజు హోమాలు, సదస్యం ఘనంగా జరిగాయి.
నాలుగో రోజైన శనివారం కూష్మాండ హోమాలు, వసంతోత్సవం, పల్లకీలో ఊరేగింపును నిర్వహించారు. అయిదో రోజు శేషహోమాలు నిర్వహిస్తారు. మూడు తరాల కిందట తమ ముత్తాత కామేశ్వరరావుకు అయిదు రోజుల పాటు వివాహం చేశారని, తన కూతురికి కూడా ఆ విధంగా చేయాలనే భావించినట్లు కామేశ్వరరావు తెలిపారు.
పరిచయం ప్రేమగా మారింది - ఆ ప్రేమ పెళ్లి దాకా వచ్చింది! - ఆ ఒక్క డెసిషన్‌తో?