Problems by Eating Unhealthy Food :కొందరికి గంట కొట్టినట్లు ఆకలవుతుంది. ఇది ఆరోగ్య లక్షణం. కొందరేమో గంటగంటకూ లాగించేస్తుంటారు. ఇది అనారోగ్య హేతువు. మారిన జీవనశైలి ఆహారపుటలవాట్లనూ మార్చేసింది. ఒకేసారి అధికమొత్తంలో తినేయడం, ఆకలి ఉన్నా, లేకున్నా ఏదో ఒకటి తింటూ ఉండడం అనర్థాన్ని తెచ్చిపెడతాయి. నిజానికి మనకు ఆకలైనపప్పుడు ఆహారం కావాల్సినప్పుడు మన శరీరం చెప్పేస్తుంది. దాన్ని అనుసరించి తీరాలి. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు చాలామంది మనకు నచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్లు తింటున్నారు. అధిక బరువు నుంచి మధుమేహం వరకు అనేక రోగాలను కొని తెచ్చుకుంటున్నారు.
ఇలా అదుపు తప్పుతూ :
- మనం తినాలా? వద్దా? అనే విషయాన్ని శరీరం తెలియజేస్తుంది. ఆకలి అయినప్పుడు, ఆకలిగా లేనప్పుడు కూడా శరీరం కొన్ని సంకేతాలనిస్తుంది.
- ఇలా జరగడానికి రెండు రకాల హార్మోన్లు కారణం. మొదటిది గ్రెలిన్ ఇది ఆకలిని సూచిస్తుంది. లెప్టిన్ కడుపు నిండిందని చెబుతుంది. దీని ప్రకారమే ఆహారం తీసుకోవాలి.
- చాలామంది టీవీ, మొబైల్ చూస్తూ తింటుంటారు. దీంతో తినే ఆహారంపై అదుపు ఉండదు. కడుపు నిండిన భావన లేకపోవడం వల్ల అధికంగా తింటుంటారు. అలా చూస్తూ తినడం వల్ల ఎంత తింటున్నాం అన్నది తెలియకుండా తినేస్తాం.
- ఇంకొందరు పని మధ్యలో ఏదో ఒక స్నాక్స్‌ను లాగించేస్తుంటారు.
- దీంతో శరీరంలో క్యాలరీల పరిమాణం పెరుగుతుంది.
ఎక్కువగా తినడం వల్ల తక్షణం వచ్చే సమస్యలు :
- సాధారణంగా మన ఖాళీ పొట్ట 75 మిల్లీలీటర్లు ఉంటుంది. ఇది 950 మిల్లీలీటర్ల పదార్థాలను ఇముడ్చుకోగలుగుతుంది. ఒకేసారి అంతకు మించి ఎక్కువగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది.
- మీరు తిన్న తర్వాత కూడా ఆహ్లాదంగా ఉండాలి. కానీ అలసటగా ఉన్నారంటే మీరా రోజు ఎక్కువ తిన్నారని అర్థం చేసుకోవాలి.
- ముఖ్యంగా హై ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయులు ఒక్కసారిగా పెరిగి, తిరిగి తగ్గుతాయి. దీనివల్ల అలసట, చికాకు కలుగుతాయి.
- ఆహారానికి, నిద్రలేమికి సంబంధం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. నిద్ర తక్కువగా పోయేవారిలో 60 శాతం మందికి రాత్రిపూట స్నాక్స్ తినే అలవాటు ఉందని నిపుణులు చెబుతున్నారు.
- జీర్ణాశయ సమస్యలైన అజీర్తి, కడుపు నొప్పి, గ్యాస్ వంటివాటికీ అధికంగా తినడమే ప్రధాన కారణమంటున్నారు వైద్యులు.
నటుడు మిథున్ చక్రవర్తి తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు ఆయన ‘నేనో భూతంలా తిన్నాను దానికిలా శిక్ష అనుభవిస్తున్నాను’ అన్నారు. మీరూ మితంగా తినండి అని తన అభిమానులకు సూచించారు.