State Wide Agitation About Attack on Eenadu Office: కర్నూలులోని ఈనాడు కార్యాలయంపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరుల దాడిని జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. విజయవాడ ప్రెస్ క్లబ్ వద్ద జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించగా, ఉరవకొండలో కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. కడపలో నిరసన తెలిపిన జర్నలిస్ట్ సంఘం, దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా మద్దికేరలో విలేకరిపై దాడిని ఖండిస్తూ విలేకరులు ఆందోళన నిర్వహించారు.
కర్నూలులో: కర్నూలు కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టు సంఘాలు, ప్రతిపక్ష, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈనాడు కార్యాలయంపై దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండిస్తూ జిల్లాలోని ఎమ్మిగనూరులో జర్నలిస్ట్ సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ర్యాలీగా సోమప్ప కూడలి చేరుకుని రహదారిపై బైఠాయించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
'ఈనాడు' కార్యాలయంపై ఎమ్మెల్యే అనుచరుల దాడి - తాళాలు బద్దలు కొట్టేందుకు యత్నం
పత్రికా స్వేచ్ఛ హరిస్తున్నారు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాస్తవాలు వెలుగులోకి తీసుకు వస్తున్న పత్రికలు, టీవీ ఛానళ్ల గొంతు నొక్కాలని కుట్ర పన్నుతున్నాడని ఆరోపించారు. ఓర్వకల్లులో తెలుగుదేశం శ్రేణులు ఆందోళన నిర్వహించారు. జాతీయ రహదారిపై ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరారు.