Srikakulam Youth Showing Talent in Kuchipudi Dance : తెలుగువారి ప్రాచీన నృత్యం కూచిపూడి. పూర్వకాలం నుంచి అందరిని మెప్పించిన ఈ నాట్యం తరువాతి కాలంలో ఆదరణ కోల్పోతూ వస్తోంది. ప్రాచీనకాలంలో ఓ వెలుగు వెలిగిన ఈ నృత్యంపై మళ్లీ ఇప్పటి యువతరం ఆసక్తి పెంచుకుంటున్నారు. ప్రత్యేకశ్రద్ధతో నేర్చుకుని దేశవిదేశాల్లో ప్రదర్శనలిస్తున్నారు. అలాంటి కళాకారుల్లో ముందువరుసలో ఉంటున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన గిరిజన బిడ్డలు.
అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తున్న ఈ యువతకి చిన్నప్పటి నుంచి కూచిపూడి నృత్యం అంటే పంచప్రాణాలు. కానీ రోజు రోజుకు ఈ నృత్యానికి తగ్గుతున్న ఆదరణ గమనించిన వీరు ఎలాగైనా కూచిపూడికి పూర్వవైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో శిక్షణ తీసుకుంటున్నారు. అసాధారణ ప్రతిభతో విదేశాలలో సైతం మంచి గుర్తింపును సాధించి భారతీయ నృత్యం ఔనత్యాన్ని ప్రపంచ నలుమూలల చాటుతున్నారు.
కూచిపూడిలో గిరిజన బిడ్డల ప్రతిభ- దేశ విదేశాల్లో అద్భుత ప్రదర్శనలు (ETV Bharat) ప్రస్తుతం ఈ కూచిపూడి గురుకులంలో 100 మందికి పైగా విద్యార్థులు ఈ కళను నేర్చుకుంటున్నారు. నాట్యరంగంలో రాణించాలన్న యువతకు వెన్నుదన్నుగా నిలుస్తోంది ఈ గురుకులం. విద్యార్థులు భవిష్యత్తులో స్థిరపడేందుకు అనువైన అవకాశాలను కల్పిస్తోంది ఈ గురుకులం. ప్రభుత్వం ఉచితంగా కూచిపూడి నాట్యాన్ని నేర్పడంతో అనేకమంది పేద గిరిజన విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి డిప్లోమా, డిగ్రీ కోర్సులను అభ్యసిస్తున్నారు.
"శ్రీకాకుళం నగరానికి 5 కిలోమీటర్ల దూరాన ఉన్న కల్లేపల్లి గ్రామంలో 12 ఎకరాల విస్తీర్ణంలో సాంప్రదాయం ప్రభుత్వ కూచిపూడి గురుకులం ఉంది. 2019 నుంచి ఇక్కడ క్రమం తప్పకుండా తరగతులు నిర్వహిస్తున్నాము. ప్రపంచంలో మొట్టమొదటి కూచిపూడి గురుకులం ఇదే కావడం దీని ప్రత్యేకత. విశ్వవిద్యాలయాల్లో కూడా చెప్పలేని నాట్య శాస్త్రాన్ని అత్యంత ప్రమాణాలతో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు ఇక్కడి అధ్యాపకులు." - స్వాతి సోమనాథ్, సాంప్రదాయం కూచిపూడి గురుకులం డైరెక్టర్
"కూచిపూడి కళను కేవలం నృత్యం కోసమే కాకుండా సామాజిక స్పృహ కలిగించేలా ప్రజలలోకి తీసుకువెళ్తున్నాము. సామాజిక అంశాలను ప్రామాణికంగా తీసుకొని వాటిపై నృత్య ప్రదర్శనలు ఇస్తూ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా వందలాది ప్రదర్శనలు చేశాం. కూచిపూడి శాస్త్రీయ నృత్య రూపాన్ని, సుసంపన్నమైన భారతీయ సంస్కృతిని ప్రపంచ నలుమూలకు విస్తరిస్తాం." - యామిని, విద్యార్థిని
కూచిపూడి రంగంలో రాణించాలన్న కలను అతి తక్కువ ఖర్చుతో ఈ గురుకులం ద్యారా నెరవేర్చుకొవచ్చని చెప్తున్నారు ఇక్కడి విద్యార్థులు. నృత్యం అంటే ఇష్టం ఉన్న వారికి ఇది అద్భుత అవకాశమని, అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిస్తున్నారు. ఒక్క కూచిపూడిలోనే శిక్షణ కాకుండా నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కొవాలనే విధంగా పాఠాలు చెప్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రచారం చేస్తూ ప్రముఖుల ప్రసంశలు పొందుతున్నారు ఈ యువత. కూచిపూడి ద్వారా తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాపింప చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వీరు తీరు అభినందనీయం. ప్రతి ఒక్కరిలోను కళ ఉంటుందని తల్లిదండ్రులు వాటిని గుర్తించి ప్రోత్సహిస్తే వారు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారని తల్లిదండ్రులకు ఇక్కడి విద్యార్థులు పిలుపునిస్తున్నారు.