Organic jaggery : బెల్లం పేరు వినగానే నోరూరుతుంది. నోటికి రుచిగానే కాదు ఐరన్ లాంటి పోషక విలువలు కూడా అధికమే. శరీరానికి ఎంతో ఆరోగ్యాన్నిచ్చే బెల్లాన్ని మిఠాయిలతో పాటు ఇతర ఆహార పదార్థాల్లోనూ విరివిగా ఉపయోగిస్తుంటారు. కాగా, బెల్లాన్నే ఆదాయ వనరుగా మార్చుకున్నారు సిక్కోలు రైతులు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం నిమ్మతొర్లువాడలో అనేక మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. సేంద్రియ విధానాలను అనుసరించి ధాన్యం, చెరకు, కూరగాయలతోపాటు ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. మొదట్లో ఆర్గానిక్ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ లేకపోవడం రైతులను నిరాశకు గురిచేసింది. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీలో సేంద్రియ పదార్థాలను మాత్రమే ఉపయోగిస్తున్నారని తెలుసుకున్న రైతులు ఇక్కడి బెల్లాన్ని పరీక్షలకు పంపించారు. మార్కెటింగ్ అధికారులు చేసిన పరీక్షల్లో నిమ్మతొర్లువాడ బెల్లం చాలా స్వచ్ఛమైనదిగా తేలింది. స్వయంగా టీటీడీ అధికారులు ఇక్కడికి వచ్చి మొత్తం బెల్లాన్ని ఇవ్వాలని కోరగా రైతులు అంగీకరించారు. ప్రస్తుతం ఏడాదికి 20 టన్నులకు పైగానే దేవస్థానానికి బెల్లాన్ని సరఫరా చేస్తుండగా భవిష్యత్తులో పరిమాణాన్ని మరింత పెంచనున్నారు.
ఆర్గానిక్ పద్ధతిలో బెల్లం తయారీ.. లాభాలు ఆర్జిస్తున్న రైతు
స్వచ్ఛమైన బెల్లం తయారీ విధానం చాలా శ్రమతో కూడుకున్న పని. ముందుగా చెరకు గడలను తీసుకొచ్చి క్రషర్‌లో వేస్తారు. దాని నుంచి వచ్చిన మొలాసిస్‌ను ఓ కంటైనర్‌లో నింపి పిప్పి, ఇతర పదార్థాలను ఏరివేస్తారు. శుభ్రమైన చెరకు రసాన్ని బాయిలర్‌లో వేడి చేస్తారు. దీన్ని కలుపుతూ ఉంటే చిక్కగా బెల్లం ద్రావణం ఏర్పడుతుంది. దీన్ని చల్లార్చితే ఎంతో రుచికరమైన బెల్లం సిద్ధమవుతుంది. దీన్ని కూలీలందరూ కలిసి చక్కగా ప్యాక్ చేస్తారు. స్వచ్ఛమైన బెల్లం తయారీలో చిన్న పొరపాటు చేసినా బెల్లం నాణ్యత దెబ్బతిని ఎందుకూ పనికి రాకుండా పోతుందని రైతులు చెబుతున్నారు. తిరుమల శ్రీవారికి తమ బెల్లంతో ప్రసాదాలు తయారు చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.