Telangana Phone Tapping Case Updates :రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు పోలీస్ అధికారులు అరెస్ట్ అయ్యారు. దర్యాప్తులో ఇంకా కొత్త అంశాలు తెర మీదకొస్తున్నాయి. కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి వెంకట రమణా రెడ్డిపై నిరంతరం నిఘా ఉంచారని దర్యాప్తులో గుర్తించారు.
WhatsApp groups in Phone Tapping Case : ఎస్ఐబీ మాజీ డీఎస్సీ ప్రణీత్ రావు నేతృత్వంలో ప్రత్యేకంగా కేఎంఆర్ పేరిట వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. గతంలో ఎస్ఐబీ అదనపు ఎస్పీగా ఉన్న తిరుపతన్నతో పాటు, అతడి పర్యవేక్షణలో పని చేసే పోలీసులను గ్రూపులో సభ్యులుగా చేర్చారు. రేవంత్ రెడ్డి, వెంకటరమణారెడ్డి ప్రధాన అనుచరుల కదలికలను పరిశీలిస్తూ గ్రూపులో చర్చించుకునే వారని దర్యాప్తులో గుర్తించారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఆర్థిక వనరులు అందకుండా చేసే ఉద్దేశంతో ప్రణాళికలు రచించినట్లు నిర్ధారించారు.
ప్రత్యర్థి పార్టీల కదలికలపై పర్యవేక్షణ :అదనపు ఎస్పీ తిరుపతన్న పోల్-2023 పేరిట మరో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశారు. తన బృందంలోని పోలీసులను అందులో సభ్యులుగా చేర్చారు. ఎన్నికల వేళ అనధికారంగా సొమ్మును జప్తు చేసి, ఆ వివరాలను ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేసుకునేవారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నేతల కదలికలపై తిరుపతన్న బృందం పర్యవేక్షణ ఉండేది. సొమ్ము తరలిస్తున్నట్లు సమాచారం వస్తే టాస్క్‌ఫోర్స్‌తో పాటు ఇతర క్షేత్రస్థాయి పోలీస్ బృందాలకు సమాచారం అందేది.
ఫోన్ ట్యాపింగ్ కేసు - విశ్రాంత ఎస్పీ దివ్యచరణ్‌రావును విచారించిన పోలీసులు