Special Story On Yadagirigutta :లోక సంరక్షణకు ఉగ్ర నరసింహుడు ఐదు రూపాలతో వెలిసిన పంచ నారసింహ క్షేత్రం యాదగిరి గుట్ట ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఆదరణ పొందుతుంది. గతంలో కొండపైన గల 14.03 ఎకరాల ప్రాంగణాన్ని క్షేత్రాభివృద్ధిలో భాగంగా 20 ఎకరాల పైగా రక్షణ గోడతో విస్తరించారు. అర ఎకరంలోని దేవాలయాన్ని 4.03 ఎకరాలకు విస్తరించారు. సంపూర్ణంగా అష్టబుజి మండప ప్రాకారాలతో పునర్నిర్మించారు. నల్లరాతితో ఆవిష్కృతమైన పంచనారసింహ క్షేత్రం భక్తులకు దివ్యానుభూతిని కలిగిస్తుంది.
మూడు రకాల దర్శనాలు : ఇక్కడ సర్వదర్శనం, శ్రీఘ్ర దర్శనం, బ్రేక్ దర్శనం ఇలా మూడు రకాల దర్శనాలు ఉంటాయి. వేకువజామున 3.30 గంటలకు ప్రారంభమై శయనోత్సవం వరకు రాత్రి పది గంటల దాకా దర్శనాలు ఉంటాయి. ఆలయ ఈవో భాస్కర్‌రావు క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులకు అవసరమైన వివరాలు తెలిపేందుకు సమాచార కేంద్ర ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ క్షేత్రాభివృద్ధిలో ప్రధానాలయ పునర్నిర్మాణం తర్వాత క్షేత్ర సందర్శన కోసం వచ్చే భక్తుల సంఖ్య భాగా పెరిగింది. రాష్ట్ర రాజధానికి 60 కి.మీ దూరాన ఉన్న ఈ క్షేత్ర సందర్శన, స్వామివారి దర్శన వివరాలు ఇలా ఉన్నాయి.
శీఘ్ర దర్శనం: త్వరగా దైవ దర్శనం చేసుకునే భక్తుల కోసం శీఘ్ర దర్శనం పేరిట ప్రత్యేక క్యూ ద్వారా ఆలయంలోకి ప్రవేశాన్ని కల్పించారు. టికెట్ ఖరీదు రూ.150 నిర్ణయించారు. ఈ దర్శనానికి ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఆఫ్‌లైన్ ద్వారా వీఐపీ వాహనాల పార్కింగ్ ఎదుట బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేశారు. ఈ దర్శనానికి గంట సమయం పడుతుంది.
వీఐపీ బ్రేక్ దర్శనం : వీఐపీ భక్తులకు రోజూ ఉదయం 9 నుంచి 10 గంటలు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బ్రేక్ దర్శన సదుపాయం ఉంటుంది. వారు అతి దగ్గర నుంచి దేవున్ని దర్శించుకోవచ్చు. ఉత్తర ద్వారం ద్వారా అంతరాలయ ప్రవేశం కల్పిస్తారు. ఈ దర్శనం రూ.300 టికెట్‌తో ఒక్కరికి మాత్రమే అనుమతిస్తారు. టికెట్లను ప్రొటోకాల్ కార్యాలయం, ప్రధాన బుకింగ్ కార్యాలయంలో వీటిని అమ్ముతారు. తప్పకుండా సంప్రదాయ దుస్తులు ధరించాలి.
వృద్ధులు, దివ్యాంగులకు : స్వామి వారి దర్శనానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, 10 ఏళ్లలోపు పిల్లలు, అనారోగ్య భక్తులకు వీఐపీ వాహనాల పార్కింగ్ ఎదుట గల షెడ్ వద్ద నుంచి ఉచితంగా వాహనాల ద్వారా తూర్పు రాజగోపురం ప్రధాన ద్వారంలోంచి ఆలయంలోకి అనుమతిస్తారు. వారి సహాయకులు రూ.150 టికెట్‌తో వెళ్లాలి.