Nehru Centenary Tribal Museum :సంస్కృతి, సంప్రదాయం, వస్త్రధారణలో గిరిజనులది ప్రత్యేక శైలి. ఆ శైలి అటవీ ప్రాంతంలో ప్రకృతి రమణీయతకు మరిన్ని సొబగులు అద్దే విధంగా ఉంటుంది. క్రమంగా కొన్ని కనుమరుగవుతున్నా, వాటి అస్థిత్వాన్ని వారి ఆచారాలు చాటుకుంటూనే ఉన్నాయి. పట్నం వాసులకు, విద్యార్థులకు ఈ అటవీ జీవన విధానాన్ని పరిచయం చేసేందుకు గిరిజన తెగల జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లు మనకు చూపిస్తోంది నెహ్రూ సెంటినరీ ట్రైబల్ మ్యూజియం. ఆ మ్యూజియం విశేషాలేంటో మీరూ చూసేయండి.
ఆదిమ గిరిజన తెగ మనిషి నుంచి ఆధునిక మానవుని వరకు పరిణామ క్రమం ఎప్పుడూ అద్భుతమే. ఆ క్రమంలో ఉపయోగించిన వస్తువులు, ధరించిన వస్త్రాలు ప్రతీదీ ఇప్పుడు ప్రత్యేకమే. దాన్ని నేటితరానికి అందించేందుకు మ్యూజియాలు వారధులుగా పని చేస్తున్నాయి. అలా గిరిజన సంస్కృతిని తెలుపుతోందీ మ్యూజియం. మ్యూజియంలోకి వెళ్లగానే ఎదురుగా గోండుల సవారి బండి ఉంటుంది. అయితే ఇందులో వ్యవసాయానికి వాడే ఎడ్లు కాకుండా కంకలు అనే చిన్న ఎడ్లను వాడతారు.
బండిని రంగురంగుల వస్త్రాలతో అద్భుతంగా అలకరించి, సరదాగా సవారీ చేసేందుకు గోండులు వాడేవారు. మ్యూజియం ప్రధాన ద్వారానికి ఎడమ వైపుగా నాయక్ పోడులు కొలిచే దేవతామూర్తుల ముఖాలు దర్శనమిస్తాయి. నాయక్ పోడులు భీముడు-హిడింబి వారసులుగా చెప్పుకుంటారు. అందుకే వారు శ్రీకృష్ణుడితో పాటు లక్ష్మీదేవరను కొలుస్తారు. వారితో పాటు పంచ పాండవులను తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు.
"హైదరాబాద్‌లో నెహ్రూ సెంటినరీ ట్రైబల్ మ్యూజియం ఉంది. ఇది చాలా పాత మ్యూజియం. దీంట్లో మన రాష్ట్రంలోని అన్ని గిరిజన జాతుల గురించి తెలుసుకుంటారు. వాళ్ల నివాసాలు ఎలా ఉండేవి, వాటిని ఎలా నిర్మించుకునేవారు, ఆహారపు అలవాట్లు, కట్టుబాట్లు ఇలా ప్రతి ఒక్క అంశం గురించి తెలుసుకోవచ్చు." - సముజ్వల, డైరెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ
10 గిరిజన తెగలకు సంబంధించి పూర్తి వివరాలు : ఈ భవనం 2003లో ప్రారంభమైంది. అయితే 11 ఏళ్లపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 32 గిరిజన తెగల అన్ని వివరాలు ఇందులో ఉండేవి. 70 శాతం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెగల వివరాలే ఉంటే, 30 శాతం తెలంగాణ తెగలకు సంబంధించిన వివరాలు ఉండేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి, నిధులు మంజూరు చేయించుకుని, ఈ మ్యూజియంలో పూర్తిగా తెలంగాణలోని 10 గిరిజన తెగలకు సంబంధించి పూర్తి వివరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో కోలం, తోటి, కొండారెడ్డి, చెంచులు ఈ నాలుగు ముఖ్యంగా వల్నరేబుల్ ట్రైబల్ గ్రూప్‌గా ఉన్నాయి. మిగతావి గోండు, కోయ, అంధ్, బంజారా, ఎరుకలతో పాటు మరో తెగ జీవన విధానాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.
కొండరెడ్లు ఇప్పటికీ ఇదే పద్ధతి : గోదావరి, కృష్ణా నదుల పరివాహక ప్రాంతాల్లో నివసించే ఈ తెగలు వ్యవసాయంతో పాటు పశుపోషణను తమ ప్రధాన వృత్తిగా కొనసాగిస్తున్నారు. వేటాడటంలో చెంచులు సిద్ధహస్తులైతే, తేనె సేకరణలో కొండరెడ్లు ప్రముఖంగా ఉన్నారు. కొండ ప్రాంతాల్లో తేనె సేకరించేందుకు భార్య, భర్త, భార్య తమ్ముడు (బావమరిది) ఒక బృందంగా ఏర్పడి వెళ్తారు. చెట్టును ఆధారంగా చేసుకుని, తాడు ఒక భాగాన్ని భర్త నడుముకు కట్టుకుని కిందకు దిగుతాడు. పైన భార్యతో పాటు భార్య తమ్ముడు తాడు మరో భాగాన్ని పట్టుకుని ఉంటారు. కొండరెడ్లు ఇప్పటికీ ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు.
"ఈ మ్యూజియంలో గిరిజనుల ప్రాంతాల గురించి చాలా మంచిగా చెప్పారు. వాళ్లు అప్పట్లో ఎలా ఉండేవారో, వస్తువులు తయారు చేసే విధానం, ఇలా ప్రతిదాన్ని చాలా స్పష్టంగా చూపించారు. మేం చాలా విషయాలు తెలుసుకున్నాము." - విద్యార్థిని