Special Story on Bhogi Festival 2025 :పల్లె, పట్నం అనే తేడా లేకుండా ప్రజలందరూ 3 రోజుల పాటు ఉత్సాహంగా జరుపుకొనే పండుగ సంక్రాంతి. రాష్ట్రంలోని ప్రతి లోగిలి ఇప్పటికే రంగుల క్రాంతిని సంతరించుకుంది. సోమవారం భోగి పండుగతో అసలు పర్వదినం ప్రారంభం అయింది. సూర్యుడు దక్షిణాయంలో ఉండే చివరి రోజుగా భోగిని చెప్పుకొంటారు. ఈ సంవత్సరం భోగికి మరో విశిష్టత సైతం ఉంది.
సోమవారం, పుష్య మాసం, పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రం కలిసి రావడంతో ఈ రోజుని శివ ముక్కోటిగా పండితులు చెప్పుకుంటున్నారు. 110 సంవత్సరాలకు ఒకసారి ఈ అద్భుత కలయిక వస్తుందని అంటున్నారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ భోగి నాడు ఆవు పేడతో చేసిన పిడకలు, నెయ్యితో పాటు ఇంట్లోని పాత కలప వస్తువులతో వేసే భోగి మంటల్లో మనలోని దుర్గుణాలు సైతం వేసి ఈ సంక్రాంతి పండుగ నుంచి మనలో ప్రగతి క్రాంతి వెల్లివిరియాలని కోరుకుందాం.
చెడు వ్యసనాలను దహనం చేద్దాం :ప్రస్తుతం యువతను పెడదోవ పట్టిస్తున్న జాఢ్యాల్లో ధూమపానం, మద్యం, మత్తు పదార్థాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ సంవత్సరం భోగి మంటల్లో మనలోని చెడు వ్యసనాలను అన్నింటినీ వేసి దహనం చేయాలి.
ఫోన్‌కు కేటాయించే టైం కొంత మేర తగ్గిద్దాం :ప్రస్తుతం సమాజంలో ప్రజలను పట్టి పీడిస్తున్న మరో జాఢ్యం సెల్‌ఫోన్. ప్రజలందరూ రోజులో ఎక్కువ టైం సెల్‌ఫోన్‌తోనే గడుపుతున్నారు. పిల్లలు, కుటుంబం, భవిష్యత్తును దూరం చేసుకుంటున్నారు. కొందరికి మొబైల్ అవసరమే కానీ, దీన్ని వినియోగించే టైం చాలా వరకు తగ్గించాల్సిన అవసరం ఉంది. సెల్‌ఫోన్‌ను కొన్ని నెలలు దూరం పెట్టిన కొందరు యువకులు ఇటీవల ప్రభుత్వ కొలువుల్లో సత్తా చాటారు. ఈ భోగి మంటల్లో సెల్ ఫోన్‌కు కేటాయించే టైం కొంత మేర వదిలేసి, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం.