Special Features of Nagarjuna Sagar Dam : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేనప్పుడు ప్రజలే చేయి చేయి కలిపి నిర్మించిన వారధి నాగార్జునసాగర్ డ్యాం. కళ్ల ముందు సజీవ సాక్ష్యం నాగార్జునసాగర్. ఇది మానవ నిర్మిత మహాసాగరం. 1955లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ డిసెంబరు 10న శంకుస్థాపన చేశారు. నాగార్జునసాగర్ డ్యాంకు శంకుస్థాపన చేసి నేటికి 69 ఏళ్లు. ఈ సందర్భంగా డ్యాం విశిష్టతను తెలుసుకుందాం.
శంకుస్థాపన సందర్భంగా ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మాట్లాడుతూ ‘నాగార్జునసాగర్ డ్యాంకు పునాది రాయి వేయడాన్ని పవిత్ర కార్యంగా భావిస్తున్నా. ఇది నవభారత మానవతా మందిరానికి పునాది. దేశమంతటా మనం నిర్మించబోయే మరెన్నో ఆధునిక దేవాలయాలకిది సంకేతం’ అని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
1955 డిసెంబరు 10న నెహ్రూ శంకుస్థాపన చేసిన తర్వాత 1956 నుంచి ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 1967 ఆగస్టు 4న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కాలువలకు నీరు వదిలి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 1970 నాటికి డ్యాం పూర్తిస్థాయిలో నిర్మించగా 1974 నాటికి రేడియల్ క్రస్టుగేట్లు అమర్చారు. నాటి నుంచి నేటి వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 22 లక్షల ఎకరాలకు నీరంది సస్యశ్యామలంగా మారింది. వేలాది గ్రామాలు, పరిశ్రమలకు వెలుగులు నింపింది. కోట్లాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ ఆంధ్రరాష్ట్ర అన్నపూర్ణగా ఖ్యాతి గాంచింది. సాగర్ డ్యాం నిర్మాణానికి రూ.132.69 కోట్లు ఖర్చయింది.