South West Monsoon Active in Telangana :రాష్ట్రంలో వానాకాలం కోలాహాలం మొదలైంది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. ఈ ఏడాది వానాకాలంలో కోటి 34 లక్షల ఎకరాల విస్తీర్ణం పైగా భూముల్లో ప్రధాన ఆహార పంట వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది, పెసర, ఇతర పంటలు సాగు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.
వరి పంట 66.57 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు కాబోతోంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన విత్తనాల సరఫరా తగినంతగా ఉండేలా సమావేశాలు నిర్వహించిన ప్రభుత్వం లభ్యతలు అందుబాటులోకి తీసుకొచ్చింది. 2023-24 సంవత్సరంలో 44.92 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు కాగా, ఈ వానా కాలం 55.53 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేయాలని ప్రభుత్వం అంచనా వేసింది.
పంటల ప్రణాళికలు సిద్ధం చేసిన సర్కార్ : 1.24 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు రైతులకు అందుబాటులో ఉంచడానికి మార్చి మాసంలోనే ప్రణాళిక చేసింది. అందుకు అనుగుణంగా 51,40,405 పత్తి ప్యాకెట్లు వివిధ జిల్లాల్లో రైతులకు అందుబాటులో ఉంచగా, వివిధ కంపెనీలకు చెందిన 10,39,040 ప్యాకెట్లు పైగా రైతులు కొనుగోలు చేశారు.
విత్తనాలకు సంబంధించి అన్ని వివరాలు తెప్పించుకొని వ్యవసాయ శాఖ నిరంతరం పర్యవేక్షించే విధంగా ఆదేశాలు ఇచ్చామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇటీవల ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో పత్తి ప్యాకెట్లు దొరకలేదని రైతుల ఆందోళనలపై మంత్రి తుమ్మల స్పందించారు. ఆయా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల రైతులు ఒకే కంపెనీకి చెందిన పత్తి విత్తనాల కోసం రావడంతో ఆ పరిస్థితి నెలకొందని స్పష్టం చేశారు.