SCR To Run 52 Additional Trains For sankranti :సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 52 అదనపు రైళ్లను నడపనున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడ, తిరుపతి, నర్సాపూర్, శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ రైళ్లను నడపనున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఆయా ప్రాంతాలకు 6 నుంచి 18వ తేదీ వరకు ఈ ట్రైన్లు అందుబాటులో ఉంటాయని వివరించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన విడుదల చేసింది.
ఇప్పటికే పలు స్పెషల్ రైళ్లను ప్రకటించిన రైల్వే :ఇదిలా ఉండగా, సంక్రాంతి పండుగ రద్దీకి తగ్గట్టుగా ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను ద.మ రైల్వే ప్రకటించింది. ఈసారి సంక్రాంతి కోసం ఇప్పటికే 122 స్పెషల్ రైళ్లను సిద్ధం చేసినట్లుగా తెలిపింది. వాటికి అదనంగా మరో 60 రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు కొద్ది రోజుల క్రితమే సీపీఆర్వో (దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి) శ్రీధర్ వెల్లడించారు. వీటితో పాటు మరో 90 పాసింగ్ త్రూ రైళ్లను కూడా నడిపిస్తున్నట్లుగా వివరించారు. సీపీఆర్వో శ్రీధర్ మాట్లాడుతూ గతేడాది 70 స్పెషల్ రైళ్లను నడిపినట్లుగా తెలిపారు. అయితే ఈ సంక్రాంతికి పెరిగే రద్దీని దృష్టిలో ఉంచుకుని దాదాపు 160 నుంచి 170 రైళ్లను ద.మ నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వివరించారు. గత ఏడాదితో పోలీస్తే ఈ ఏడాది అధిక సంఖ్యలో స్పెషల్ ట్రైన్లను నడుపుతున్నట్లుగా వివరించారు.