Sons Abandon Elderly Mother In Warangal :నేటి బాలలే రేపటి పౌరులు. మరి నేటి పౌరులే రేపటి వృద్ధులు కాదా? ఈ చిన్న విషయం మరిచిపోయి ఎందుకు తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు. రేపటి రోజున మనమూ వృద్ధులమే. మన భాష, యాస అన్నీ నేర్చుకున్నవి తల్లి దగ్గర నుంచే. 'దిల్లీకి రాజైనా తల్లికి కొడుకే' అని గట్టిగా చెప్పే మన దేశంలో వృద్ధాప్యంలోకి వెళ్లిన తల్లిని దూరంగా ఉంచుతున్నారు.
ప్రేమగా కనిపెంచిన పాపానికి ఇప్పుడు ఎక్కడ బతకాలో తెలియని దీనస్థితి ఆ తల్లిది. వృద్ధాప్యంలో ఉన్న తనకు ఇంత చోటు ఇవ్వాలని పంచాయతీ కార్యాలయం ముందు కూర్చొని ఉంది ఆ తల్లి. వృద్ద వయసులో తల్లి ఆ బిడ్డలకు భారమైంది. నువ్వంటే నువ్వంటూ వంతులేసుకొని వదిలేశారు. దీంతో దిక్కుతోచని ఆమె పంచాయతీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన దోమకొండ రాజమ్మకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు చేశారు. రాజమ్మ భర్త పదేళ్ల కిందట చనిపోయాడు. 80 ఏళ్ల వయోభారంతో పెద్ద కుమారుడి వద్ద ఉండేది. ఇటీవల ఆయన అనారోగ్యంతో మరణించాడు. దీంతో రాజమ్మ బాగోగులను పెద్ద కోడలు చూసుకుంటుంది. భర్త చనిపోవడం, ఆర్థికంగా ఇబ్బందులు ఉండటం వల్ల తాను అత్తను చూడలేనని గ్రామంలోని రెండో కుమారుడి వద్దకు పంపింది. ఆ కుమారుడు కూడా తన భార్య చనిపోయిందని, తాను కూడా చూసుకోలేనని తెలిపాడు. దీంతో బాధతో వరంగల్‌లో ఉంటున్న మూడో కుమారుడికి ఫోన్ చేసింది.