Son Kills Father Over Broken Aquarium in Shamirpet :వస్తువులని వాడుకోవాలి. మనుషులని ప్రేమించాలి. కానీ మారుతున్న డిజిటల్ ప్రపంచంలో మనుషుల్ని వాడుకొని, వస్తువులను ప్రేమించడం మొదలుపెట్టాం. వస్తువులను మనుషుల కంటే అమితంగా ఇష్టపడటం అనేక అనర్థాలకు దారి తీస్తోంది. ఇందుకు ఈ ఘటనే తార్కాణం. ఓ కుటుంబం వస్తువులపై పెంచుకున్న ప్రేమ ఆ ఇంట్లో ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. ఒక చీర కోసం తల్లి, కుమార్తె మధ్య వివాదం ఏర్పడింది. ఈ తగాదాలో పక్కన ఉన్న అక్వేరియం గాజు పగలడంతో మద్యం మత్తులో ఉన్న కుమారుడు తల్లిపై రోకలితో దాడి చేశాడు. ఇది గమనించిన తండ్రి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ వివాదంలో కోపోద్రిక్తుడైన కుమారుడు తండ్రిని హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది.
ఇష్టంగా తెచ్చుకున్న అక్వేరియం గాజు పగిలిందనే కోపంలో మద్యం మత్తులో ఉన్న కుమారుడు కన్నతల్లిపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన తండ్రిని హత్య చేశాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీనాథ్, స్థానిక ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం, శామీర్పేట పెద్దమ్మ కాలనీకి చెందిన ఆలకుంట హన్మంత్ (50) కూలీ పనులు చేస్తాడు. అతని కుమారుడు నర్సింహ (28) మద్యానికి బానిస కావడంతో అతని భార్య వదిలేసింది. దీంతో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు.