Telangana Samagra Kutumba Survey : రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే వేగంగా సాగుతోంది. కొన్ని చోట్ల ఎన్యూమరేటర్లు అడిగిన ప్రశ్నలన్నింటికీ కొందరు సమాధానాలు చెప్పగా.. మరికొంత మంది తాము అసలు సమాధానాలు చెప్పం అన్నట్లు మాట్లాడుతున్నారు. మరోవైపు సర్వేలో ఫ్రిజ్లు, టీవీలు, ఏసీలు, ద్విచక్రవాహనాలు, ఏసీలు గురించి వివరాలు వెల్లడిస్తే ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని సోషల్ మీడియా విపరీతమైన ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. కానీ వారం రోజుల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన ప్రకటనతో, వాటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వ పథకాలు ఆగిపోవని తెలిపారు. అయినా సరే ఇంకా చాలా మంది పూర్తి సమాచారం ఇవ్వటం లేదని గణకులు చెబుతున్నారు.
ముఖ్యంగా స్థిర, చరాస్తుల వివరాలు చెబితే తమకు ఎక్కడ ప్రభుత్వ పథకాలు ఇవ్వరోననే భయంతో వివరాలు చెప్పడం లేదు. అలాగే ద్విచక్ర వాహనాలు, కార్లు, టీవీలు, ట్రాక్టర్లు, స్మార్ట్ఫోన్లు ఉన్నా లేవంటూ ఎన్యూమరేటర్లను పక్కదారి పట్టిస్తున్నారు. ఈ వివరాలు ఇచ్చిన ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పినా సరే వినిపించుకోవడం లేదు. ఈ విషయంపై మంత్రి కూడా క్లారిటీగా ఈ వస్తువుల వివరాలు ఇస్తే ఎలాంటి ప్రభుత్వ పథకాలు ఏవీ ఆగిపోవనీ, ఇంకా ఏవైనా పథకాలు ఇవ్వడానికి ఆస్కారం ఉందని చెబుతున్నా.. కొందరు మాత్రం వినడం లేదు.
ఉపాధి కోసం వేరే ప్రాంతాల్లో ఉంటున్న వారు అయితే తమ వివరాలను సొంతూళ్లలోనే ఇస్తామంటూ సర్వేను దాటవేస్తున్నారు. దీంతో సర్వేకు సహకరించని వారి నుంచి సంతకం తీసుకుంటున్నామని ఎన్యూమరేటర్లు చెబుతున్నారు. ఇప్పుడు ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.. ప్రభుత్వం, అధికారులు ఎంత చెప్పిన ప్రజలు వినకపోవడంతో సమగ్ర కుటుంబ సర్వేలో రోజుకూ తక్కువ నమోదు శాతం అవుతున్నాయి. తక్కువ శాతం నమోదవుతున్న చోట్ల ప్రత్యేక సిబ్బందిని పంపించి ప్రక్రియ వేగవంతం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.